ITR Filing | మీరు ఏటా రూ.2.5 లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నారా.. అయితే, మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే. ఒకవేళ రూ.2.5 లక్షల్లోపు ఆదాయం మాత్రమే కలిగి ఉన్నా ఆర్థిక ప్రణాళికలో భాగంగా మీరు తప్పనిసరిగా ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోగా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయకపోతే పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. విదేశాల్లో ఆస్తులు ఉన్నా.. విదేశాల్లో ఆదాయం సంపాదిస్తున్నా.. గతేడాది రూ.లక్షకు పైగా విద్యుత్ బిల్లు చెల్లించినా.. రూ.కోటికి పైగా బ్యాంక్లో డిపాజిట్ చేసినా, రూ.2 లక్షలకు పైగా విదేశీ ప్రయాణానికి ఖర్చు చేసినా ఐటీఆర్ సబ్మిట్ చేయడం తప్పనిసరి.
ఒక ఏడాదిలో రూ.2.5 లక్షల పై చిలుకు ఆదాయం సంపాదించే వారు పెనాల్టీలు తప్పించుకోవాలంటే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. ఆ పెనాల్టీలేమిటో ఓ లుక్కేద్దాం.. !
ఒకవేళ 2022 జూలై 31 గడువు మీరు మిస్ అయితే.. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ఉంటుంది. కానీ లేట్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ మీ ఆదాయం రూ.5 లక్షల పై చిలుకు ఉంటే రూ.5000, రూ.5 లక్షల్లోపు ఉంటే రూ.1000 లేట్ ఫీజు పే చేయాలి. చెల్లించని ఆదాయం పన్నుపై ఒకశాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 31 తర్వాత ఏ నెలలో ఐదో తేదీ తర్వాత చెల్లించినా.. పూర్తి వడ్డీ పే చేయాల్సిందే. ఆస్తుల విక్రయంతో గానీ, ఇతర ఆదాయాలతో గానీ నష్టం వస్తే గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేసిన వారు మాత్రమే తదుపరి ఏడాదిలో నష్టాలను పూడ్చుకోవడానికి వీలు ఉంటుంది.