ముంబై, జూలై 11: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,468.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఐటీ సేవల సంస్థ ఎల్టీఎం. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,254.6 కోట్ల లాభంతో పోలిస్తే 17 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18 శాతం ఎగబాకి రూ.11,608 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఆదాయంలో 2.8 శాతం వృద్ధి నమోదు చేసుకున్నది.
ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో వేణు లంబు మాట్లాడుతూ..ఈ ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, ఇతర అంశాలతో పాటు ఏఐ కేంద్రీకృత వ్యూహాన్ని అమలు చేయడంలో సాధించిన పురోగతిని నమోదు చేసుకున్నట్టు చెప్పారు. గత త్రైమాసికంలో 1.68 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు చెప్పారు. కొత్తగా 16 క్లయింట్లు జతవడంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 740కి చేరుకున్నట్టు చెప్పారు. కంపెనీకి వచ్చిన ఆదాయంలో యూరప్ వాటా 2.4 శాతం తగ్గగా, ఇతర దేశాలు కూడా 10 శాతం చొప్పున తగ్గాయి. ప్రస్తుతం సంస్థలో 87,886 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.