హైదరాబాద్, ఏప్రిల్ 20 : గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.163.20 కోట్ల నికర లాభాన్ని గడించింది రాష్ట్రనికి చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.154.20 కోట్ల లాభం కంటే ఇది 5.83 శాతం అధికం. కంపెనీ ఆదాయం రూ. 1,181.20 కోట్ల నుంచి రూ. 1,751.40 కోట్లు ఆర్జించింది. మరోవైపు, రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.16 లేదా 320 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది.
స్టార్టప్‌లకు నిధుల కొరత
ముంబై, ఏప్రిల్ 20: దేశీయ స్టార్టప్‌లను నిధుల కొరత వేధిస్తున్నది. ఈ ఏడాది జనవరి-మార్చిలో భారతీయ స్టార్టప్‌లు కేవలం 2 బిలియన్ డాలర్ల (రూ.16,500 కోట్లు)నే సమీకరించగలిగాయి. నిరుడు ఇదే వ్యవధితో పోల్చితే ఏకంగా 75 శాతం తగ్గడం గమనార్హం. దాదాపు గడిచిన మూడేండ్లలో ఏ త్రైమాసికంలోనూ ఇంత తక్కువగా స్టార్టప్‌ల్లోకి నిధులు రావడం జరుగలేదని డాటా సంస్థ సీబీ ఇన్సైట్స్ తెలిపింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది స్టార్టప్‌ల్లోకి 10 బిలియన్ డాలర్లు కూడా వచ్చేట్టు లేవని అంటున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలు స్టార్టప్ వ్యవస్థకు దన్నుగా లేకపోవడం కూడా ఈ గడ్డు పరిస్థితులకు కారణమేనన్న విమర్శలు వస్తున్నాయిప్పుడు.