హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ప్రపంచస్థాయి జీవశాస్త్ర, ఔషధ రంగ కంపెనీలకు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. జీవశాస్ర్తాల రంగంలో భాగ్యనగరం తన తిరుగులేని నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తున్నదని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో మంగళవారం కెనడాకు చెందిన ప్రముఖ జనరిక్ ఔషధాల తయారీ సంస్థ జాంప్ ఫార్మాస్యూటికల్స్ రూ.250 కోట్లతో నెలకొల్పిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జాంప్ సంస్థకు కెనడా వెలుపల ఏర్పాటైన మొదటి కేంద్రం ఇదే. మాత్రలు, పొడులు, లిక్విడ్ రూపంలో నోరు, ముక్కు ద్వారా తీసుకొనే మందులను ఇక్కడ తయారు చేయనున్నారు.
ఈ కేంద్రంలో 200 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మొదటి దశలో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టగా, 80 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జాంప్ యాజమాన్యం ఔషధ తయారీ యూనిట్ స్థాపనకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలను పరిశీలించి చివరకు జీనోమ్ వ్యాలీ అత్యంత అనుకూలమని ఎంపిక చేసుకొన్నదని తెలిపారు. దీన్నిబట్టి జీనోమ్ వ్యాలీ పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యంగల ప్రాంతంగా ఉన్నదనే విషయం అర్థం చేసుకోవచ్చని అన్నారు. మరోవైపు, జీనోమ్ వ్యాలీకి సమీపంలో త్వరలో 5 స్టార్ హోటల్ కూడా రాబోతున్నదని మంత్రి చెప్పారు.
ప్రభుత్వ విధానాలు నచ్చి వచ్చాం: పిలాన్
రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప్రగతిశీల విధానాల వల్లనే తాము కంపెనీ స్థాపనకు జీనోమ్ వ్యాలీని ఎంపిక చేసుకొన్నామని జాంప్ ఫార్మా కార్పొరేషన్ సీఈవో లూయిస్ పిలాన్ తెలిపారు. మంత్రి కేటీఆర్ ముందుచూపు, దార్శనికత జీవశాస్ర్తాల పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం తో కలిసి పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, జీవశాస్ర్తాల విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్, లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు సత్యనారాయణ చావా తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంపై విమర్శలు
కేంద్ర ప్రభుత్వం తీరుపై మంత్రి కేటీఆర్ మరోమారు విమర్శలు గుప్పించారు. జీనోమ్ వ్యాలీకి అనుసంధానంగా ఉన్న కంటోన్మెంట్ ద్వారా రోడ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గడిచిన ఏడేండ్లుగా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదన్నారు.
అహ్మదాబాద్ కన్నా హైదరాబాద్ ఇష్టం
గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు అహ్మదాబాద్ కన్నా హైదరాబాదే ఇష్టమని అంటున్నారని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వ్యాక్సిన్ల ఉత్పత్తుల్లో భాగ్యనగరం వాటా 33 శాతంగా ఉండటంతో పాటు తెలంగాణలో జీవశాస్ర్తాల పరిశోధన, అభివృద్ధికి అత్యుత్తమ వాతావరణం ఉండటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యాపార అనుకూల విధానాలతో ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భాగస్వాములతో కలిసి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.