పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి.ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సెగ.. భారత్‌కు గట్టిగానే తగులుతున్నది. వార్ కొనసాగితే దేశంలో చమురు సంక్షోభమే మరి. ముడి చమురు సరఫరాలో అత్యంత కీలకంగా మారిన హార్మూజ్ జలసంధి మూతబడితే.. మన ఆర్థిక వ్యవస్థ
ఆగమాగమేనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయిప్పుడు.
న్యూఢిల్లీ, జూన్ 18: ప్రపంచానికి చమురే చోదకశక్తి. ఆ చమురు సరఫరా అత్యధికంగా గల్ఫ్ దేశాల నుంచే జరుగుతుండగా, ఇందులో ఎక్కువగా హార్మూజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతున్నది. సరిగ్గా ఇదే.. ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని ప్రపంచ దేశాలు కలవరపడేలా చేస్తున్నది. అవును.. ఇజ్రాయెల్‌తో యుద్ధం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయవచ్చన్న ఆందోళనలు పెరుగుతున్నాయి మరి. ఇరాన్ తీర ప్రాంతం పొడుగూత ఆనుకుని ఉన్న ఈ 33 కిలోమీటర్ల సముద్ర మార్గం మూతబడితే భారత్‌సహా ఆసియా దేశాలకు చమురు కష్టాలు తప్పవన్నది నిజంగా నిజం.
ఇరాన్ అణు కార్యకలాపాలు తమకు ముప్పేనని భావిస్తున్న ఇజ్రాయెల్.. ఆ దేశంపై దాడులు మొదలు పెట్టింది. ఇరాన్ ప్రతిదాడులతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చగా.. ఇప్పుడిది యావత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్నే కుదిపేస్తున్నది. ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, కతార్, యూఏఈ, ఒమన్ దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న ఎన్నో దేశాల్లో గుబులు మొదలవుతున్నది. ఈ దేశాలన్నిటి సరిహద్దులు, ఇరాన్ దేశ సరిహద్దు మధ్య ఉన్న హార్మూజ్ జలసంధి మీదుగానే ఆయా దేశాలకు నిత్యం ముడి చమురు, ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ) ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ దాడుల దృష్ట్యా ఇరాన్ ఈ జలసంధిని మూసేయాలని చూస్తున్నట్టు సమాచారం. దీన్ని ఆ దేశ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సీనియర్ కమాండర్ సర్దార్ ఇస్మాయిల్ కోసారి సైతం ధ్రువీకరిస్తుండటం గమనార్హం.
దేశ చమురు అవసరాలకు దిగుమతులే ఆధారం. ఆ దిగుమతుల్లో సగానికిపైగా సౌదీ తదితర గల్ఫ్ దేశాలే దిక్కు. ఇవన్నీ కూడా హార్మూజ్ జలసంధి ద్వారానే భారత్‌కు చేరుతున్నాయి. ప్రపంచ ముడి చమురు సరఫరాలో గల్ఫ్ దేశాల వాటా సుమారు 25 శాతంగా ఉన్నది. రోజూ 20 మిలియన్లకుపైగా బ్యారెళ్ల క్రూడాయిల్, 25% ఎల్ఎన్జీ హార్మూజ్ గుండా సరఫరా అవుతున్నది. అయితే ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ మార్గంలో రవాణాకు ఆటంకాలు ఏర్పడితే వేల కిలోమీటర్లు తిరిగి చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల దేశీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమంటాయని, తయారీ ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం విజృంభిస్తుందని మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ ద్రవ్యోల్బణమైతే తగ్గిందని, ఆర్బీఐ వృద్ధిరేటుపై దృష్టిపెట్టి వడ్డీరేట్లను తగ్గిస్తూపోతున్నదో.. మళ్లీ అదే వడ్డీరేట్లను పెంచేస్తుందని, దీనివల్ల రుణాలు ప్రియమై అన్ని రంగాలు కుదేలవుతాయన్న ఆందోళనల్నీ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత జీడీపీ ప్రగతి.. ఈ యుద్ధంపైనే ఆధారపడి ఉందంటున్నవారూ లేకపోలేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ సమస్య భారత్‌లోనేగాక, ఎన్నో ఆసియా, ఐరోపా దేశాల్లోనూ తలెత్తుతుంది.
చమురు సరఫరాలో అంతరాయంతో భారత రిఫైనరీ కార్యకలాపాలు, రిటైల్ ఇంధన ధరలు, యావత్తు ఆర్థిక వ్యవస్థే ప్రభావితమవు తాయి. హార్మూజ్ జలసంధిలో రవాణా ఆగితే షిప్పింగ్ ఖర్చు లు పెరుగుతాయి. ప్రయాణ సమ యం పెరిగిపోతుంది. సంబంధిత బీమా ప్రీమియంలూ ఎక్కువే.
-నితిన్ తివారీ, ఫిలిప్‌క్యాపిటల్
ముడి చమురు సరఫరాలో హార్మూజ్ జలసంధి చాలా కీలకంగా ఉన్నది. ఇది మూతబడితే గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరగడం ఖాయం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం విజృంభిస్తుంది. ఫలితంగా ఇప్పుడిప్పుడే అన్ని దేశాల రిజర్వ్ బ్యాంకులు తగ్గిస్తూపోతున్న వడ్డీరేట్లకు బ్రేకులు పడుతాయి. అదే జరిగితే రుణ లభ్యత క్షీణిస్తుంది. పెట్టుబడులు కరువై అన్ని రంగాలు దెబ్బతింటాయి. చివరకు ఆర్థిక వ్యవస్థలో మందగమనం, మాంద్యం ఛాయలు కనిపిస్తాయి.
-అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్