Iran-Israel War | ఇజ్రాయెల్-ఇరాక్ ఉద్రిక్తతల మధ్య ఆదివారం ఉదయం అమెరికా మూడు అణుకేంద్రాలపై దాడులకు పాల్పడింది. దాంతో యావత్ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ దాడులను ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ ప్రభావం చమురు ధరలపై పడే అవకాశం ఉన్నది.
ప్రపంచ చమురు మార్కెట్ లోని సంక్షోభాన్ని ముందుగానే గుర్తించింది భారత్. ఈ క్రమంలో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించి.. చమురు దిగుమతుల్లో కీలక మార్పుల చేసింది. గల్ఫ్‌దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతులను భారీగా పెంచింది. ప్రపంచ వాణిజ్య విశ్లేషణ సంస్థ ‘క్యాప్లర్’ సమాచారం ప్రకారం.. భారత్ జూన్ నెలలో రష్యా నుంచి రోజుకు 20–22 లక్షల బ్యారెల్స్ చమురును దిగుమతి చేసుకుంది. ఇది గత రెండేళ్లలోనే అత్యధికం. మే నెలలో ఈ సంఖ్య 11 లక్షల బ్యారెల్స్‌గా ఉండేది. గతంలో రష్యా నుంచి భారత చమురు దిగుమతులు ఒకశాతం ఉండగా.. ప్రస్తుతం 40-44 శాతానికి చేరాయి.
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత్ చమురు వ్యూహాన్ని మార్చుకుంది. జూన్ నెలలో ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ నుంచి మొత్తం 20 లక్షల బ్యారెల్స్ మాత్రమే చమురు దిగుమతి చేసుకుంది. ఇది గత నెలలతో పోల్చితే తక్కువగా ఉంది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా యుద్ధంలోకి ప్రవేశించడంతో ప్రతిగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇదే జరిగితే పెద్ద ఎత్తున సరుకు రవాణా నిలిచిపోనున్నది. భారత్ఇప్పటికీ 40శాతం చమురు హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తున్నది. అలాగే రెడ్ సీలో హౌతీ తిరుగుబాటుదారులు నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భారతదేశం గతంలో ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచే చమురు కొనుగోలు చేసేది. కానీ, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యా భారీ రాయితీలతో చమురు అందించడంతో భారత్ చమురు వ్యూహాన్ని మార్చుకుంది. భారత్ ప్రస్తుతం రష్యా, అమెరికా, లాటిన్ అమెరికా దేశాలనుంచి కూడా చమురు దిగుమతి చేసుకుంటోంది. క్యాప్లర్ నివేదిక ప్రకారం.. భారత్ జూన్ నెలలో అమెరికా నుంచి రోజుకు 4.39 లక్షల బ్యారెల్స్‌ను చమురు కొనుగోలు చేసింది. మునుపటి 2.80 లక్షల బ్యారెల్స్‌తో పోల్చితే చాలా ఎక్కువ. భారత్ రోజూ 51 లక్షల బ్యారెల్స్చమురు దిగుమతి చేసుకుంటోంది. వీటిని భారత రిఫైనరీల్లో ప్రాసెస్ చేసి పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాలను తయారు చేస్తుంటారు.