న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులును చొప్పించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కదంతొక్కాయి. గడిచిన నాలుగు సెషన్లలో ఏకంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఆరు శాతం వరకు లాభపడ్డాయి. వీటికితోడు ఈ ఏడాది సాధారణ స్థాయి కంటే అధికంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా మదుపరుల్లో సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది.
ద్రవ్యోల్బణం ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో వచ్చే సమీక్షలో రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం కూడా సూచీల్లో జోష్ పెంచింది. ఫలితంగా గత నాలుగు సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 4,706.05 పాయింట్లు లేదా 6.37 శాతం లాభపడగా, నిఫ్టీ 1,452.5 పాయింట్లు లేదా 6.48 శాతం చొప్పున ఎగబాకాయి. దీంతో మదుపరుల సంపద రూ.25.77 లక్షల కోట్లు ఎగబాకి రూ.4,19,60,046.14 కోట్ల(4.90 ట్రిలియన్ డాలర్లు)కి చేరుకున్నది.
గత మూడు సెషన్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లు సెలవుపాటించాయి.