హైదరాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో రోజుకో కొత్త పెట్టుబడితో సుభిక్షంగా సాగిన పారిశ్రామిక రంగం గడిచిన రెండేళ్లుగా తిరోగమనంలో పయనిస్తున్నది. వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్తుంటే, కొత్త పెట్టుబడులు జాడేలేదు. రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తెచ్చినట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అవి అమలుకు నోచుకోవడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలతో పోల్చుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పదేండ్ల పాలనలో రెండింతలు కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అంతేకాదు, రూ. 2.66 లక్షల కోట్ల పెట్టుబడులు, దాదాపు 18 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి కూడా. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా మారాయి.
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఇతర రాష్ర్టాలకు తరలిపోయాయి. వీటిలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తయారీ కంపెనీ చెన్నైకి తరలివెళ్లగా, సెమి కండక్టర్ల తయారీ దిగ్గజం కేన్స్ సెమికాన్ కంపెనీ గుజరాత్‌కు వెళ్లడం ఇందుకు ఉదాహరణ. కార్నింగ్ రాష్ట్రంలో రూ.1,000 కోట్లు, అలాగే, కేన్స్ రూ. 2,800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనా భరోసా కల్పించకపోవడంవల్లే ఆ కంపెనీలు వెళ్లిపోయినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం రెండుసార్లు దావోస్ ప్రపంచ వాణిజ్య సదస్సులకు హాజరవడంతోపాటు అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, బ్రిటన్ తదితర దేశాలు పర్యటించి దాదాపు రూ. 2.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ప్రభుత్వం పదేపదే గొప్పలు చెబుతున్నది. కానీ, ఇంతవరకు ఏ ఒక్క కంపెనీ రాలేదు.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం, 2023 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చుకుంటే 2024 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా టాప్-10 నగరాల్లో ఒక్క అహ్మదాబాద్ మినహా మిగిలిన తొమ్మిది నగరాల్లో కంపెనీల నమోదు గణనీయంగా తగ్గిపోయింది. ఢిల్లీలో 15 శాతం, బెంగళూరులో 17 శాతం, ముంబైలో 13 శాతం, హైదరాబాద్‌లో పదిశాతానికిపైగా తగ్గుదల నమోదైంది. అంతేకాదు, టాప్-5 నగరాలైన ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, పుణె, హైదరాబాద్ నగరాల్లో కంపెనీల నమోదు ఐదేండ్ల కనిష్ఠస్థాయికి పడిపోయినట్లు కంపెనీల వ్యవహారాల శాఖ వెల్లడించింది.
బీఆర్ఎస్ పాలనలో సుమారు 154 కొత్త పారిశ్రామికవాడలను ఏర్పాటుచేయగా, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తరువాత ఒక్క కొత్త ఇండస్ట్రియల్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. అంతేకాదు, గతంలో బీఆర్ఎస్ సర్కారు పరిశ్రమల కోసం సిద్ధంచేసిన సుమారు 1.5 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను సైతం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడంలేదు. అన్నిటికి మించి ఇప్పుడు తాజాగా హిల్ట్(హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్) పేరుతో సరికొత్త పాలసీని ప్రవేశపెట్టి ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న పారిశ్రామికవాడలన్నింటినీ ఖాళీ చేయించేందుకు అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేసేలా చర్యలకు శ్రీకారం చుట్టింది.
మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు అనుమతుల పేరుతో పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి తెరలేపినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పారిశ్రామికవేత్తలు తెలంగాణవైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, నూతన ఎంఎస్ఎంఈ పాలసీ పేరుతో దాదాపు ఏడాదిన్నరపాటు కాలయాపన చేసిన సర్కారు, చివరికి పాలసీ ప్రవేశపెట్టినప్పటికీ దానికి అవసరమైన మార్గదర్శకాలు ఇంకా జారీ చేయకపోవడంతో కొత్త పరిశ్రమల ఏర్పాటు పూర్తిగా నిలిచిపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో దాదాపు 14,000 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఫార్మాసిటీని కాంగ్రెస్ సర్కారు రద్దుచేసింది. ఫార్మాసిటీకి బదులు రాష్ట్ర వ్యాప్తంగా 10 ఫార్మా విలేజ్లను ఏర్పాటుచేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ రెండేళ్లయినా ఇంతవరకు అవి ఏర్పాటు కాలేదు. ఫార్మా విలేజ్ల కోసం మొదటి దశలో వికారాబాద్, నల్ల గొండ, మెదక్‌లను ప్రభుత్వం ఎంపికచేసింది. అయితే వికారాబాద్ జిల్లా పరిధిలో భూసేకరణ చేపట్టగా ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మిగిలిన రెండు జిల్లాల్లో భూములు అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రతిపాదనలు విరమించుకున్నారు.
ఫార్మాసిటీ రద్దుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫార్మాసిటీ స్థానంలో గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు అదికూడా సాధ్యంకాలేదు. అంతేకాదు, ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే, రాష్ట్రంలో రాజకీయ కక్షపూరిత ప్రభుత్వం ఏర్పాటైందనే ఉద్దేశంతో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్న కంపెనీలు సైతం ఏపీ, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ర్టాలకు వెళ్లిపోయాయి.
పదేండ్లపాటు రాష్ర్టాన్ని పాలించిన కేసీఆర్… తన దార్శనికతతో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దారు. పదేళ్లలో దేశవిదేశాలకు చెందిన అనేక కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకాగా, అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించాయి. అమెజాన్, టీసీఎస్, డెలాయిట్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, విప్రో, మైక్రోసాఫ్ట్, ఐబీఎం తదితర కంపెనీలు అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయి.
అంతేకాదు, నోవార్టీస్, జీఎస్కే, రెడ్డీస్ ల్యాబ్స్, అరబిందో, హెటిరో వంటి ఔషధ కంపెనీలు, ఆల్ఫాలాన్, బ్యాండ్రోన్, బెండిట్ వంటి లైఫ్‌సైన్సెస్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు చేపట్టాయి. ఔషధ కంపెనీలకు కేంద్రంగా ఉన్న జీనోమ్‌వ్యాలీని గణనీయంగా విస్తరించడమే కాకుండా వైద్య పరికరాలకోసం సుల్తాన్‌పూర్‌లో ప్రత్యేకంగా మెడికల్ డివైజెస్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కళ్లజోళ్లు, ఎక్స్‌రే మిషన్ల దగ్గర్నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేసే స్టెంట్ల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయడం విశేషం.
బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడులు రూ.2.66 లక్షల కోట్లు
18 లక్షల మంది ఉపాధి అవకాశాలు వచ్చినవారు
రాష్ట్రవ్యాప్తంగా కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటు 154
3 2023-24లో మూడు బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక
బీఆర్ఎస్ పాలనలో పదేండ్లపాటు పరిశ్రమలకు రెప్పపాటు కూడా కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడలేదు. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చాక నిర్వహణ పనుల పేరుతో పారిశ్రామికవాడల్లో రెండేండ్లుగా అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. గతంలో ముందస్తు సమాచారమిచ్చి సెలవుదినాల్లో మాత్రమే నిర్వహణ పనులు చేపట్టేవారు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కరెంటు కోతలు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరెంటు కష్టాలు మళ్లీ గుర్తుకొస్తున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్ల మంజూరీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నది. ట్రాన్స్ఫార్మర్లను ఆయా కంపెనీల నిర్వాహకులే కొనుగోలు చేసుకుంటున్నప్పటికీ కనెక్షన్లు ఇచ్చేందుకు కావాల్సిన వివిధ పనిముట్ల కొరత ఉందని, అందుకే కనెక్షన్ల మంజూరీలో జాప్యం జరుగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
డిపార్ట్మెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూడు బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐతో తెలంగాణ గుజరాత్ తరువాత రెండో స్థానంలో నిలిచింది. 2022-23లో 1.3 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా, ఆ తర్వాతి ఏడాది రెట్టింపు పెట్టుబడులు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్ ఐ-పాస్ విధానం ద్వారా 2014-23 మధ్య రూ. 2,60,028 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు జరిగినట్లు, తద్వారా 17.54 లక్షల ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు గత ఏడాది కాంగ్రెస్ విడుదల చేసిన 2023 ప్రభుత్వ నివేదికలో వెల్లడించడం విశేషం.
– ఫీచర్ స్టోరీ
