శశాంక్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. హైదరాబాద్‌లో పదేండ్ల క్రితం రూ.50 లక్షలతో ఓ ఇల్లు కొన్నాడు. నెలనెలా ఈఎంఐలు చెల్లిస్తూపోతున్నాడు. ప్రస్తుతం ఇంకా చెల్లించాల్సిన ఇంటి అప్పు రూ.30 లక్షలుగా ఉన్నది. కానీ నెలనెలా ఈఎంఐలు భారంగా కనిపిస్తున్నాయి. దీంతో రుణంలో కొంతకొంత చెల్లిస్తూపోతే లాభామేమో? అన్న ఆలోచనలోపడ్డాడు. మరోవైపు ఆ మిగతా సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడిగా పెడితే ప్రయోజనమేమో? అన్న సందేహాలూ మదిని తొలిచేస్తున్నాయి. అయితే ఒక్క శశాంక్దే ఈ పరిస్థితి కాదు. మనలో చాలామందిదీ ఇదే పరిస్థితి. మిగులు నిల్వలతో గృహ రుణాన్ని తీర్చాలా? లేక ఆ నిధులను ఇతర ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించాలా? అన్న దైలామా కొట్టుమిట్టాడుతుంటారు. మరి నిపుణులు ఏమంటున్నారు?
ఇదీ సంగతి..
పెట్టుబడి అనేది ఎప్పుడూ ఒకే దగ్గర పోగై ఉండిపోకూడదు. ఒకటికి మించిన సాధనాల్లో పెట్టుబడులు పెడితేనే సురక్షితం. రిస్క్లనూ తగ్గిస్తుంది. అయితే ఇల్లు అనేది ఓ దీర్ఘకాల మదుపు. నిజానికి సొంతిల్లు కల సాకారమనేది మంచిదే అయినా.. దీర్ఘకాలంపాటు మన కష్టార్జితం దానికే అంకితం చేసుకునేలా ఉంటే మాత్రం కొంత ఆలోచించాల్సిన అంశమని చెప్పవచ్చు. కాబట్టి అనుకోకుండా మన చేతికి పెద్ద మొత్తంలో నగదు వస్తే.. దాంతో ఇంటి రుణాన్ని వీలైనంత మేరకు తీర్చేయడమే తెలివైన పనిగా భావించవచ్చు. దీనివల్ల ముఖ్యంగా వడ్డీ భారం చాలావరకు తగ్గుతుంది. ఎందుకంటే హోం లోన్ వంటి దీర్ఘకాలిక రుణాల్లో అసలు కంటే దానిపై చెల్లించే వడ్డీ మొత్తమే ఎక్కువ. అసలు, వడ్డీ కలిపి అప్పు కొండను తలపిస్తుంటుంది. ఎంతకీ దిగిరాని పరిస్థితిలో పడిపోతాం. కాబట్టి అనూహ్యంగా వచ్చిన మొత్తాలతో ఇంటి అప్పు భారాన్ని తగ్గించుకోవడం ఉత్తమం. పైగా ఫ్లోటింగ్ వడ్డీరేట్లతో గృహ రుణం తీసుకున్నప్పుడు, మధ్యమధ్యలో కొంత మొత్తాలు చెల్లిస్తే జరిమానాలేవీ పడవు.
నెలనెలా మిగుళ్లతో..
నెలనెలా కొంత మొత్తాలు మిగులుతూపోతే గృహ రుణం తీర్చేకన్నా.. మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిని పరిశీలించడం లాభదాయకమని చెప్పవచ్చు. స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌ల్లో మిగులు నిల్వలను దీర్ఘకాలిక పెట్టుబడులుగా పెడితే 10-12 శాతం రాబడులను ఆశించవచ్చు. 8-9 శాతం వడ్డీరేట్లతో ఉన్న గృహ రుణం తీర్చడం కంటే ఇదే నయం మరి. అయితే స్టాక్ మార్కెట్లు, దాని ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. కాబట్టి రిస్క్‌కు సిద్ధపడితేనే మరింత లాభాలను అందుకోవచ్చన్నది మరువద్దు. రిస్క్‌లతో కూడిన పెట్టుబడులకు ఇష్టపడనివారు దూరంగా ఉంటేనే మంచిది. అయితే ఆర్థిక నిపుణుల సలహాతో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్)ను ప్రయత్నించవచ్చు. ఇవికూడా రిస్క్‌తో కూడుకున్నవే అయినా.. మన అవసరాలకు తగ్గట్టుగా ఎక్స్పర్ట్స్ సూచనలతో ప్లానింగ్ చేసుకోవచ్చు. నిజానికి దీర్ఘకాలంలో స్టాక్ పెట్టుబడులు మెజారిటీ ఇన్వెస్టర్లకు లాభాల్నే పంచాయని గణాంకాలు చెప్తున్నాయి.
చివరగా..
మదుపరులు ఎప్పటికైనా తమ పెట్టుబడులు బహుళ సాధనాల్లోకి మళ్లిస్తేనే మరింత లాభదాయకం. అలాగే చిన్న వయసు నుంచి చేసే పొదుపు.. పెద్ద లాభాల్ని పంచిపెడుతుంది. స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాలకు తగ్గట్టుగా పెట్టుబడి సాధనాలను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. నగదు నిల్వలు సరిపడా ఉంటే వాటితోనే ఇల్లు కొనుక్కోవడం లాభమనే చెప్పవచ్చు. అయితే మోయలేనంత భారాన్ని మాత్రం ఎత్తుకోవద్దు.