న్యూఢిల్లీ, మార్చి 17: అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమన్నది. సంక్షోభ సమయాల్లో సురక్షిత సాధనంగా భావించే పుత్తడిని ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోలు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 48 డాలర్ల వరకూ పెరిగి 1,968 డాలర్ల వద్దకు చేరింది. ఇందుకు అనుగుణంగా దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల ధర రూ.1,100 వరకూ పెరిగి రూ.59,000 స్థాయిని మించింది.
అయితే మన దేశంలోని వివిధ నగరాల్లో స్పాట్ మార్కెట్లు సాయంత్రమే ముగియనున్నందున, అంతర్జాతీయ ధర వీటిల్లో ప్రతిబింబించలేదు. ఇక్కడి స్పాట్లో శనివారం పెరుగుతుందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో శుక్రవారం 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.270 పెరిగి రూ. 58,690 వద్ద ముగిసింది. 22 క్యారట్ల ధర రూ.250 అధికమై రూ. 53,800 వద్ద నిలిచింది.