Small Savings | పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎస్ఎస్సీ) సహా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2025 జనవరి ఒకటో తేదీ నుంచి 2024-25 నాలుగో త్రైమాసికం కొనసాగుతుంది. 2025 మార్చి 31 వరకూ నాలుగో త్రైమాసికం ముగుస్తుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో నిర్ణయించిన వడ్డీరేట్లు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకంపై 8.2 శాతం వడ్డీరేటు, మూడేండ్ల టర్మ్ డిపాజిట్ మీద 7.1 శాతం వడ్డీరేటు కొనసాగుతుంది. ఇక పాపులర్ పబ్లిక్ ప్రావిడెండ్ (పీపీఎఫ్)పై 7.1, పోస్టాఫీసులు నిర్వహించే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేటు 4 శాతం కొనసాగుతుంది. 115 నెలలకు మెచ్యూర్ అయ్యే కిసాన్ వికాస్ పత్రాలపై వడ్డీరేటు 7.5 శాతంగా ఉంది. ఇక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)లో పొదుపుపై 7.7 శాతం వడ్డీ అమలులో ఉంటుంది. నెలవారీ ఇన్ కం స్కీం మీద 7.4 శాతం వడ్డీ అందిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు త్రైమాసికాలుగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.