Mahesh Jethmalani | యూఎస్ షార్ట్ షెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ (Hindenburg Reseaarch)పై సీనియర్ న్యాయవాది, బీజేపీ రాజ్యసభ సభ్యుడు మహేశ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ సంస్థలపై చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని సెబీ జారీ చేసిన నోటీసులకు స్పందించడానికి బదులు ‘సెబీ చైర్మన్ మాధాబి పురీ బుచ్’ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడాన్ని తప్పు బట్టారు. భారత స్టాక్ మార్కెట్లను అస్థిర పరిచేందుకే హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసిందని ఆరోపించారు. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల్లో కొత్త దనమేమీ లేదని ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై సీరియస్ అటెన్షన్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
సెబీ జారీ చేసిన నోటీసులకు స్పందించక పోగా, యూఎస్ షార్ట్ షెల్లర్ ‘హిండెన్ బర్గ్’.. సెబీ చైర్ పర్సన్‌ను అప్రతిష్ట పాల్జేసేందుకే ఆమెను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేసిందన్నారు. తద్వారా భారత రిటైల్ ఇన్వెస్టర్ల కష్టాన్ని డాలర్లుగా సొమ్ము చేసుకునేందుకు యూఎస్ షార్ట్ షెల్లర్ ప్రయత్నిస్తోందని మహేశ్ జెఠ్మలానీ ఆరోపించారు. అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా వస్తున్న నివేదికల వెనుక రాజకీయ హస్తంపైనా విచారణ జరిపించాలని గత నెల 19న డిమాండ్ చేశారు.