Infosys | దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగులకు లేఆఫ్స్, ఫ్రెషర్స్ విషయంలో సంస్థ తీరు, శాలరీ హైక్‌లు వంటి కారణాలతో నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్ (Mysuru Campus)లో శిక్షణ పొందుతున్న వందలాది మంది ట్రైనీలను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరింతమంది ట్రైనీలపై వేటు వేసింది. ఇంటర్నల్ అసెస్మెంట్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో వారిని తొలగించినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
దాదాపు 195 మంది ట్రైనీలను తొలగించినట్లు మనీకంట్రోల్ నివేదించింది. ఈ మేరకు ఇవాళ ఈమెయిల్ ద్వారా ఆయా ట్రైనీలకు తొలగింపు సమాచారాన్ని అందించినట్లు పేర్కొంది. సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ విభాగంలోని ట్రైనీలు తొలగింపుకు గురైనట్లు తెలిపింది. వరుసగా మూడు సార్లు అంచనా పరీక్షల్లో విఫలమైన కారణంగా వారిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇలా ట్రైనీలను తొలగించడం ఈ ఏడాది ఇది నాలుగోసారి కావడం గమనార్హం. తొలుత ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరు మైసూర్ క్యాంపస్ నుంచి దాదాపు 300 కంటే ఎక్కువ మంది ట్రైనీలను తొలగించింది. ఆ తర్వాత మార్చిలో 35, ఏప్రిల్‌లో 240 కంటే ఎక్కువ మందిని ఇంటికి సాగనంపింది. ఇప్పుడు మరో 195 మంది ట్రైనీలపై వేటు వేసింది. తాజా పరిణామంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ సంస్థ దాదాపు 800 మంది ట్రైనీలను తొలగించినట్లు మనీకంట్రోల్ నివేదించింది.
అయితే, మార్చిలో తొలగింపుకు గురైన ట్రైనీలకు సంస్థ ఓ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రోల్ కింద రిక్రూట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీని కింద 12 వారాల పాటూ శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఉద్యోగులకు తెలిపింది. లేఆఫ్‌కు గురైన ట్రైనీలందరికీ రిలీవింగ్ లెటర్‌తోపాటు ఒక నెల ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లించనున్నట్లు చెప్పింది. బీపీఎమ్ మార్గాన్ని తీసుకోవడానికి ఇష్టపడని ట్రైనీలకు కంపెనీ మైసూరు నుంచి బెంగళూరుకు రవాణాతో పాటు వారు తమ స్వస్థలానికి చేరుకోవటానికి అయ్యే ప్రయాణ ఖర్చులను కూడా భరిస్తామని ఉద్యోగులకు తెలిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ట్రైనీలకు ఇన్ఫోసిస్ అల్టిమేటం..!
రెండేళ్ల క్రితం ఫ్రెషర్ల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించిన ఇన్ఫీ.. గతేడాది వారిని విధుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అందులోని కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 7వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు (Mysuru) క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మంది ట్రైనీలకు (trainees) లేఆఫ్‌లు (Layoffs) ప్రకటించింది. వరుసగా మూడు సార్లు అంచనా పరీక్షల్లో విఫలమైన కారణంగా వారిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ట్రైనీలను 50 మందితో కూడిన బ్యాచ్‌లుగా పిలిచి వారితో మ్యూచువల్ సెపరేషన్ లెటర్లపై సంతకాలు చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. సాయంత్రం 6 గంటల్లోపు ట్రైనీలంతా క్యాంపస్‌ను వీడాలని అల్టిమేటం జారీ చేసింది. అయితే, ట్రైనీల తొలగింపుపై ఇన్ఫీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. లేఆఫ్‌లకు గురైన ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. లేఆఫ్‌లకు గురైన ట్రైనీలు తాజాగా ప్రధాని కార్యాలయం తలుపులు తట్టినట్లు తెలుస్తోంది.
మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి..
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్ (Mysuru Campus) లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మందికిపైగా ట్రైనీలకు (trainees) సంస్థ లేఆఫ్‌లు (Layoffs) ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ప్రధాన మంత్రి కార్యాలయానికి (PMs Office) చేరింది. బలవంతపు లేఆఫ్‌లపై (forceful layoffs) ట్రైనీలు పీఎంవోకు ఫిర్యాదు చేశారు. ఈ తొలగింపులపై ప్రధానమంత్రి కార్యాలయానికి 100కు పైగా ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో జోక్యం చేసుకొని తమ ఉద్యోగాలు తమకు తిరిగి ఇప్పించాలంటూ ట్రైనీలు కోరారు. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక శాఖ (labour ministry) కూడా స్పందించింది. ఈ మేరకు కర్ణాటక కార్మిక శాఖకు ఫిబ్రవరి 25న నోటీసులు పంపింది. ఈ అంశంపై దర్యాప్తు చేసి కేంద్రానికి నివేదిక అందించాలని నోటీసుల్లో పేర్కొంది.
Also Read..
Jharkhand: బాలికపై సామూహిక అత్యాచారం.. ముగ్గుర్ని అరెస్టు చేసిన పోలీసులు
Airspace | పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత దిశగా కేంద్రం అడుగులు..!
IND vs PAK | పాకిస్థాన్‌కు ఆర్థికంగా ఉచ్చు బిగిస్తున్న భారత్.. ఆ దేశ దిగుమతులపై కన్ను..!