సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): వ్యాపారులు తమ వ్యాపార లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకోవాలి లేదంటే కొత్తవి తీసుకోవాల్సిందే. కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఉన్న వ్యాపార సముదాయాలు, అగ్నిప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యలపై ఫోకస్ పెట్టేందుకు ఆయా విభాగాలకు చెందిన వ్యాపారులకు లైసెన్స్‌లు తప్పని సరిచేయనున్నారు. మొదట సినిమా థియేటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులపై ఫోకస్ పెడుతూ ఆ తరువాత లాడ్జీలు, హోటల్స్, మాల్స్, ఇతరత్రా వ్యాపార కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు మల్కాజిగిరి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు ఆన్లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమలవుతున్న ఈ విధానాన్ని మల్కాజిగిరిలోను కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ట్రాఫిక్‌పై ఫోకస్..
జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం ఆయా వ్యాపార కేంద్రాలు నిర్ణీత పార్కింగ్ స్థలాలను కేటాయించుకోవాల్సిన అవసరముంటుంది. పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడంతో చాలా చోట్ల రోడ్లపైనే అక్కడకు వచ్చే వాళ్లు వాహనాలను నిలిపేస్తున్నారు. ఇది ట్రాఫిక్ సమస్యలను సృష్టించడంతో పాటు అక్కడకు వచ్చే కస్టమర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ విషయాన్ని కూడా మల్కాజిగిరి పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎక్కువగా హోటల్స్, లాడ్జీల వద్ద ఈ సమస్యలుంటాయి. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఉండే వ్యాపార సముదాయాలకు సంబంధించిన డేటా బేస్‌ను తయారు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఎన్వోసీ తీసుకోవాల్సిందే..
అగ్నిప్రమాదాలు సంభవించకుండా ఉండాలంటే తరుచూ ఆయా వ్యాపార కేంద్రాల్లో అగ్నిమాపక శాఖ తనిఖీలు చేయాలి. కానీ చాలా మంది వ్యాపారులు ఒక సారి ఎన్వోసీ తీసుకున్న తరువాత, ఆయా వ్యాపార సముదాయాల్లో ఎన్నో మరమ్మతులు చేసినా, ఆ తరువాత వాటిని తనిఖీ చేయించడం లేదు. మొదటి సారిగా ఫైర్ ఎన్వోసీ తీసుకున్న తరువాత అది కొంత కాలానికే పరిమితమవుతుంది. ఆ తరువాత ఆ ఫైర్ ఎన్వోసీని రెన్యువల్ చేయించుకోవాలి. కానీ చాలా మంది ఆ విషయాన్ని విస్మరించడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
సినిమా థియేటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు, ఫామ్ హౌస్‌లు, లాడ్జీలు ఇలా ఎక్కువ మంది ఉండేందుకు అవకాశాలున్న వ్యాపార కేంద్రాల నిర్వాహకులు తప్పని సరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరముందని అధికారులు చెబుతున్నారు. పోలీసుల నుంచి అనుమతి, ఎన్వోసీ పొందేందుకు ఫైర్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ విభాగాలకు సంబంధించిన సంబంధిత ఎన్వోసీ కూడా తప్పని సరి చేయనున్నారు. రెండో దఫాలో ఇతర వ్యాపార కేంద్రాలకు సంబంధించిన వాటి విషయంపై పోలీసులు దృష్టి పెట్టనున్నారు. అయితే ఇప్పటికే అనుమతులు, ఎన్వోసీ లు ఉన్న వాళ్లు మాత్రం వాటి కాల పరిమితి ఉన్నంత వరకు కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరముండదని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోనున్నారు.