రాంచీ: జార్ఖండ్(Jharkhand)లో ఓ బాలికను సామూహిత్యంగా అత్యాచారం చేసిన కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. రాంచీలో ఆ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నామ్కుమ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన కొన్ని రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. బాలిక తండ్రి ఏప్రిల్ 27వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని, రేప్‌కు పాల్పడిన ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు రాంచీ ఎస్పీ సుమిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. నేరానికి పాల్పడినట్లు ఆ ముగ్గురూ అంగీకరించినట్లు ఆయన చెప్పారు. నిందితుల్ని జగదీశ్ స్వాన్సి, విష్ణు ముండ, దీపక్ ముండాగా గుర్తించారు. బాధిత బాలికకు, విష్ణు అనే వ్యక్తికి గతంలో పరిచయం ఉన్నది. వాళ్లు సోషల్ మీడియాలో టచ్‌లో ఉన్నారు. మార్కెట్‌కు వెళ్లి ఇంటికి వస్తున్న అమ్మాయిని విష్ణు అనే వ్యక్తి ఓ కొండ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఫిర్యాదు ద్వారా తెలిసింది. ఆ కొండ వద్ద విష్ణు మిత్రులు అక్కడే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని రేప్ చేశారని ఎస్పీ వెల్లడించారు.