Gold ETFs | బంగారం ఆభరణాలంటే భారతీయ మహిళలకు ఎంతో ఇష్టం.. పెండ్లిండ్లు, కుటుంబ వేడుకలు, పండుగల వేళ బంగారం కొనుగోలు చేస్తారు. అవకాశం లేకుంటే ఉన్న ఆభరణాలే ధరిస్తారు. కానీ భారతీయుల అవసరాలకు సరిపడా బంగారం కావాలంటే.. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ధర ఎక్కువగానే ఉంటది.. అంతేకాదు దిగుమతి సుంకంతోపాటు ప్రభుత్వానికి వాణిజ్య లోటుకు కారణమవుతుంది.
ఈ నేపథ్యంలో ఫిజికల్ గోల్డ్ వినియోగాన్ని తగ్గించడానికి కేంద్రం డిజిటల్ బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించింది. బ్యాంకుల్లోనూ డిజిటల్ ఫామ్‌లో బంగారం కొనవచ్చు. అంతే కాదు.. దేశీయ స్టాక్ మార్కెట్లు నిర్వహించే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లో మదుపు చేయొచ్చు. స్టాక్ మార్కెట్లలో సంస్థల స్టాక్స్ కొన్నట్లే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోనూ పెట్టుబడులకు పరిమితుల్లేవు. అలా కొనుగోలు చేసిన గోల్డ్ ఈటీఎఫ్‌ల విలువ, ఫిజికల్ గోల్డ్ విలువ యధాతథంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో ఒడిదొడుకుల మాదిరే గోల్డ్ ఈటీఎఫ్ ధరల్లోనూ తేడాలు ఉంటాయి.
ఇన్వెస్టర్లు ఎల్లవేళలా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టరు. తమ వీలును బట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు గత ఆగస్టులో 17 నెలల గరిష్ట స్థాయిలో రూ.1028 కోట్లను తాకాయి. గతేడాది ఏప్రిల్ తర్వాత గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. కానీ, గత నెలలో రూ.175 కోట్లకు దిగి వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఎఎంఎఫ్ఐ) వెల్లడించింది. అంతకుముందు జూలైలో రూ.456 కోట్ల మేరకు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు రూ.298 కోట్లు మాత్రమే.
గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికంలో రూ.1243 కోట్లు, డిసెంబర్ త్రైమాసికంలో రూ.320 కోట్లు, సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.165 కోట్ల మేరకు పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మార్చి తర్వాత గత మే నెలలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల దిగి రావడంతో కొనుగోళ్లకు కొంత అవకాశం లభించింది. ఫిజికల్ బంగారం (స్వచ్ఛత)తో సమానంగా గోల్డ్ ఈటీఎఫ్‌లను గణిస్తారు.