హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు దెబ్బకు పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి. సర్‌చార్జ్‌ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమున్నట్లు వడ్డిస్తుండటంతో పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నారు. ఓపెన్ యాక్సిస్ విద్యుత్తుపై అదనపు సర్‌చార్జ్ పేరుతో ఒక్కో యూనిట్‌కు రూ.1.40 వసూలు చేస్తున్నారు. ఇక బకాయిలపై కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పేరుతో 18 శాతం వడ్డీని ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో పరిశ్రమవర్గాలు లబోదిబోమంటున్నాయి. పరిశ్రమలు ప్రభుత్వ సంస్థల నుంచే కాకుండా ప్రైవేటు కంపెనీల నుంచి ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో విద్యుత్తు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రస్తుతం ఓపెన్ యాక్సిస్ పద్ధతిపై నిషేధం ఉండగా, ఇప్పటికే ఈ విధానంలో విద్యుత్తును కొనుగోలు చేస్తున్న పరిశ్రమల నుంచి సర్చార్జ్తోపాటు స్టాండర్డ్ అడిషనల్ సర్‌చార్జ్ పేరుతో అదనంగా ఒక్కో యూనిట్‌పై రూ.1.40 చొప్పున వసూలు చేస్తున్నారు.
ఇది పరిశ్రమలకు తలకుమించిన భారంగా మారింది. ఓపెన్ యాక్సెస్ విద్యుత్తు కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని, అదనపు సర్చార్జిని ఎత్తివేయాలని పరిశ్రమవర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వివిధ కారణాలతో మూతపడిన పరిశ్రమల విద్యుత్తు బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఆ బకాయిలపై 18 శాతం వడ్డీ భారాన్ని మోపుతున్నారు. నష్టాలతో మూతపడిన చాలా పరిశ్రమలు ఇప్పుడు మళ్లీ ప్రారంభించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ముందుగా తమ బకాయిలు తీర్చాలని విద్యుత్తు సంస్థలు పట్టుబడుతున్నాయి. వన్‌టైమ్ సెటిల్మెంట్ పద్ధతిని ప్రవేశపెట్టి విద్యుత్తు బకాయిలను పరిష్కరించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
విద్యుదుత్పత్తికి అనుమతించండి
ఐఎస్టీఎస్(ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టం) పథకం కింద కేంద్రం రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీకి భారీగా రాయితీలు అందిస్తున్నది. అయితే మన రాష్ట్రంలో రూఫ్‌టాప్ విద్యుత్తును ఒక మెగావాట్ సామర్థ్యం వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా, దీన్ని ఐదు మెగావాట్ల సామర్ధ్యానికి పెంచుకునేందుకు వీలుగా తమకు నిరభ్యంతర ధృవపత్రం(ఎన్ఓసీ) ఇవ్వాలని పరిశ్రమాధిపతులు కోరుతున్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఏపెన్ యాక్సిస్ గ్రీన్ పాలసీకి సంబంధించి మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
అలాగే, పరిశ్రమల్లో బాయిలర్ల ద్వారా విడుదలయ్యే వేడి వాయువుల (డబ్ల్యూహెచ్ఆర్బీ-వేస్ట్ హీట్ రికవరీ బాయిలర్స్)నుంచి విద్యుత్తు తయారుచేసుకునే అవకాశం కూడా కల్పించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వాయువులను చల్లార్చి గాలిలోకి వదలాల్సి వస్తున్నదని, దీనివల్ల అదనంగా నిర్వహణ భారం పడుతున్నదని చెబుతున్నారు. తమకు అనుమతిస్తే ఎవరి పరిశ్రమలో వారు కొంతమేరకు విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే వీలు కలుగుతుందని అంటున్నారు. విద్యుత్తుకు సంబంధించి వివిధ సమస్యలపై ఇటీవల తాము టీజీ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీకి వినతిపత్రం సమర్పించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తమ వినతులు పరిష్కరించకుంటే మునుముందు పరిశ్రమలు కొనసాగించడం మరింత కష్టమవుతుందని వారు వివరించారు.