Rakul Preet Singh | సోషల్ మీడియా వినియోగం విస్తరిస్తున్నకొద్దీ, సైబర్ మోసగాళ్ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి ప్రజలను మోసం చేసే ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పలు నటీమణులు ఇలాంటి ఫేక్ అకౌంట్ల గురించి ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. కొంతమంది కేటుగాళ్లు రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో ఒక నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి, ప్రజలకు సందేశాలు పంపుతున్నట్లు బయటపడింది.8111067586 అనే నంబర్‌కు రకుల్ ఫోటోను వాట్సాప్ డీపీగా ఉంచి, బయోలో ఆమె నటించిన సినిమాల పేర్లు కూడా రాసి నమ్మకాన్ని కలిగించేలా చేశారు. ఈ నంబర్ ద్వారా పలువురికి రకుల్ పేరుతో మెసేజులు పంపినట్లు తెలిసింది.
ఈ విషయం రకుల్ దృష్టికి రాగానే ఆమె వెంటనే అలర్ట్ అయింది. ఫేక్ చాట్ స్క్రీన్షాట్లని షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో హెచ్చరికను జారీ చేసింది. “హాయ్ ఫ్రెండ్స్… ఎవరో నా పేరుతో వాట్సాప్‌లో ప్రజలకు మెసేజ్‌లు పంపుతున్నారు. ఇది నా నంబర్ కాదు. దయచేసి ఆ నంబర్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించకండి. వెంటనే బ్లాక్ చేయండి అని పేర్కొంది. ఇంతకుముందూ పలువురు హీరోయిన్లు ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. అదితి రావు హైదరి కూడా గతంలో ఫేక్ వాట్సాప్ నంబర్ బారిన పడ్డారు. ఎవరో నా ఫోటో ఉపయోగించి ఫోటోగ్రాఫర్లకు మెసేజులు పంపుతున్నారు. నేను ఇలాంటి మెసేజులు పంపను. ప్రతిదీ నా టీమ్ ద్వారా మాత్రమే జరుగుతుంది అని ఆమె అప్పట్లో హెచ్చరించారు.
‘కాంతార: చాప్టర్ 1’ నటి రుక్మిణి వసంత్ కూడా ఇదే రకమైన మోసాన్ని ఎదుర్కొన్నారు.9445893273 నంబర్ నుంచి ప్రజలకు కాల్స్, మెసేజులు రావడంతో,“ఈ నంబర్ నాది కాదు. స్పందించకండి” అని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనలన్నీ సెలబ్రిటీల పేరుతో జరిగే సైబర్ మోసాలు ఎంతగా పెరిగిపోయాయో మరోసారి రుజువు చేస్తున్నాయి. నిపుణులు కూడా ఇలాంటి అనుమానాస్పద నంబర్లకు స్పందించవద్దని, అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్నిమాత్రమే నమ్మాలని ప్రజలకు సూచిస్తున్నారు.