హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రజా ప్రభుత్వానికి పారిశ్రామిక వృద్ధి అంటే పెట్టుబడుల గణాంకాలు మాత్రమే కాదని, అది ప్రజల జీవనోపాధని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న పరిశ్రమలు, మహిళా, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు అందాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని అన్నారు.
ఇందుకోసం ప్రతి శుక్రవారం ఎంఎస్ఎంఈ సంఘాలు, పారిశ్రామిక రంగ ప్రతినిధులతో చర్చించడానికి సమయం కేటాయిస్తానని ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్ పో-2026 ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టిమాట్లాడుతూ.. ప్రభు త్వం, పరిశ్రమల మధ్య ఎఫ్‌టీసీసీఐ ఒక బలమైన వారధిగా నిలుస్తున్నదని చెప్పారు. పారిశ్రామిక ప్రదర్శన యంత్రాలు, ఉత్పత్తుల ప్రదర్శన మాత్రమే కాదని, ఆలోచనలు పంచుకునే ఒక అద్భుత వేదిక అని ఆన్నారు.