Indigo | న్యూఢిల్లీ, జూలై 6: దేశీయ విమానయాన రంగంలో ఇండిగో రివ్వున దూసుకుపోతున్నది. ఎయిర్ ఇండియా టేకోవర్‌తో విమానయాన రంగంలో టాటాలు భారీ విస్తరణ చేపట్టినా, ప్రస్తుతానికి ఇండిగో దాదాపు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నది. గోఫస్ట్ దివాలా తీయడం, ఆకాశ ఎయిర్ వేగంగా కార్యకలాపాల్ని విస్తరించకపోవడంతో 79 శాతం విమానయాన రూట్లను ఇండిగో శాసిస్తున్నది. జూలై నెలలో దేశంలో నిర్వహణలో ఉన్న 1048 మార్గాల్లో (హైదరాబాద్-బెంగళూరును ఒక రూట్గానూ, బెంగళూరు-హైదరాబాద్‌ను మరో రూట్గానూ పరిగణిస్తారు) 830 రూట్లలో ఇండిగో విమానాల్ని నడుపుతుండగా, తదుపరి స్థానంలో ప్రభుత్వ సంస్థ అలియన్స్ ఎయిర్ 158 రూట్లతో ద్వితీయస్థానంలో ఉంది. ఎయిర్ ఇండియా 153 రూట్లలో, స్పైస్ జెట్ 118 రూట్లలో, మరో టాటా గ్రూప్ కంపెనీ, త్వరలో ఎయిర్ ఇండియాతో విలీనం కానున్న విస్తారా విమానాలు 100 మార్గాల్లో నడుస్తున్నట్టు ఫ్లైట్ డాటాను అందించే ఓఏజీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశంలోని మొత్తం 1048 ఫ్లైట్ రూట్లలో 769 మార్గాల్లో కేవలం ఒకే ఎయిర్‌లైన్ విమానాలు నడుపుతున్నది. అందులో 552 రూట్లలో (72 శాతం) ఇండిగో విమానాలే ఎగురుతున్నాయి. వాస్తవానికి ఇండిగో విమానాలు 830 మార్గాల్లో ప్రయాణిస్తున్నా, అందులో 66 శాతం (552) ఏకఛత్రాధిపత్యమే. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్)లో లేని రూట్లు హైదరాబాద్-అహ్మదాబాద్, కోల్‌కతా-అహ్మదాబాద్, చెన్నై-అహ్మదాబాద్, ఢిల్లీ-నాగ్‌పూర్ తదితర ప్రధాన నగరాల మధ్య ఒకే ఎయిర్‌లైన్ నడుస్తుండటం గమనార్హం. ఇండిగో అయితే భోపాల్, వడోదర, డెహ్రాడూన్, రాజ్‌కోట్‌ల నుంచి గోవా (మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్)కు ఫ్లైట్స్ నిర్వహిస్తున్నది.
భారత్‌లో వివిధ మార్గాల్లో 60 శాతం విమాన రాకపోకలు ఇండిగోవే. సీట్స్ విషయానికొస్తే ఈ సంస్థ ప్రయాణీకులకు 64 శాతం ఆఫర్ చేస్తున్నది. మొత్తం విమానాల్లో అందుబాటులో ఉన్న సీట్లలో 10 శాతం ఎయిర్ ఇండియా ఇస్తుండగా, టాటాలకు చెందిన ఇతర ఎయిర్‌లైన్స్ విస్తారా, ఎయిర్ఏశియాలు 8 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. సీట్ల సామర్థ్యంలో టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ అన్నీ కలిపి 26 శాతం అందిస్తున్నాయి. ప్రతీ నెలా 60 శాతం కాకపోయినా, ఇండిగో మార్కెట్ వాటా 55-60 శాతం మధ్య ఉంటుందని అంచనా. స్పైస్ జెట్ కేవలం 4 శాతం సీట్లను ఆఫర్ చేస్తుండగా, ఆకాశ ఎయిర్‌కు 3 శాతం వాటా ఉంది.