IndiGo | దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ‘ఇండిగో’ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నది. కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయగా, మరికొన్ని సర్వీసులను రీషెడ్యూల్ చేసింది. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో గగనతలంపై కేంద్రం ఆంక్షలు విధించింది. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సన్నాహాల నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రతి రోజూ ఉదయం 10.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ గగనతలంపై ఆంక్షలు విధించారు.
ఈ నేపథ్యంలో 19 నుంచి 26 వరకూ ఆయా సమయాల్లో నడిచే విమాన సర్వీసుల రీషెడ్యూలింగ్, రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో శుక్రవారం తెలిపింది. ఇప్పటికే తమ విమాన సర్వీసుల టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు.. ప్రస్తుత పరిస్థితిపై సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ఆల్టర్నేటివ్ ఆప్షన్లు ఎంచుకోవడమా..? రీఫండ్ చేయడమా..? ప్రయాణికుల నిర్ణయానికే వదిలేసినట్లు పేర్కొంది. ఇప్పటికిప్పుడు రీషెడ్యూల్ లేదా రద్దు చేసిన విమాన సర్వీసుల వివరాలను ఇండిగో వెల్లడించలేదు. ప్రతి రోజూ ఇండిగో దేశవ్యాప్తంగా సుమారు 1800 విమాన సర్వీసులు నడుపుతున్నది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయ పరిధిలో రోజూ సుమారు 1300 విమాన సర్వీసులు నడుస్తాయి.