IndiGo | ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం కొనసాగుతున్నాయి. ఆరో రోజు ఆదివారం దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో 650 విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా గత ఆరు రోజుల్లో దాదాపు 3వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. దాంతో దేశంలో విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. లక్షలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నది. మరో వైపు ఇండిగోపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంక్షోభంపై 24గంటల్లో స్పందించాలని పేర్కొంటూ డీజీసీఏ శనివారం ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, సీవోవో, అకౌంటబుల్ మేనేజర్ పోర్కెరాస్లకు షో కాజ్ నోటీసులు జారీ చేసింది. కార్యాచరణ ప్రణాళిక, వనరుల నిర్వహణలో గణనీయమైన వైఫల్యం వల్లనే ఈ సంక్షోభం తలెత్తిందని డీజీసీఏ నోటీసుల్లో పేర్కొంది.
ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభానికి ప్రధాన కారణం కొత్త ఎఫ్డీటీఎల్ రూల్స్‌ను అమలు చేసేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడమేనని.. దాంతో విమానయాన సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ నోటీసుల్లో ప్రశ్నించింది. ఇండిగో సర్వీస్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రి కే రామ్మోహన్ నాయుడు శనివారం సీనియర్ మంత్రిత్వశాఖ అధికారులు పీటర్ ఎల్బర్స్‌తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మరో వైపు ఏవియేషన్ మినిస్ట్రీ ప్రయాణికులకు పెండింగ్‌లో ఉన్న అన్ని రీఫండ్స్‌ను ఆదివారం రాత్రి 8 గంటల్లోగా క్లియర్ చేయాలని ఆదేశించింది. విమానాల రద్దు నేపథ్యంలో ప్రభావితమైన ప్రయాణికుల నుంచి రీషెడ్యూలింగ్‌కు ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని స్పష్టం చేసింది. ఫిర్యాదులను పరిష్కరించేందుక, రియల్ టైమ్ అప్డేట్స్ అందించేందుకు ప్రయాణికులకు స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.