Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల నష్టానికి తెర పడింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఐటీ స్టాక్స్ మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 300.44 పాయింట్ల వృద్ధితో 59,141.23 పాయింట్ల వద్ద స్థిర పడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 91.40 పాయింట్ల లాభంతో 17,622.25 పాయింట్ల వద్ద ముగిసింది.
సోమవారం ట్రేడింగ్‌లో బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, హిందూస్థాన్ యూనీ లీవర్ (హెచ్‌యూఎల్), నెస్ట్లే ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్ లబ్ధి పొందాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 2.03 శాతం, నిఫ్టీ మీడియా 1.26, నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్, నిఫ్టీ ఆటో లాభ పడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్-50 ఫ్లాట్‌గా ముగిసింది. స్మాల్ క్యాప్ 0.69 శాతం నష్టపోయింది.
శుక్రవారం బీఎస్ఈ-30 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.279.68 లక్షల కోట్ల నుంచి సోమవారం రూ.97,000 కోట్లు పెరిగి రూ.280.65 లక్షల కోట్లకు చేరింది. బీఎస్ఈలో 1899 స్టాక్స్ నష్టపోగా, 1715 స్క్రిప్ట్‌లు లాభాలతో ముగిశాయి. మరో 135 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతల నేపథ్యంలో ఉదయం ట్రేడింగ్ ఊగిసలాట ధోరణితో మొదలైంది. తర్వాత కోలుకుని ముందుకు సాగాయి. నిఫ్టీ స్వల్ప లాభాలతో 17,540.65 పాయింట్లతో ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడే ట్రేడింగ్‌లో గరిష్ఠంగా 17,667.20 పాయింట్ల స్థాయికి చేరుకుంది. తిరిగి 17,429.70 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.
మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ 58,747.31 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్ అంతర్గత ట్రేడింగ్ 59,277.55 పాయింట్ల గరిష్ట, 58,487.76 పాయింట్ల కనిష్ట స్థాయి మధ్య సాగింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.79.79 వద్ద ముగిసింది.
బీఎస్ఈ-30లో 23 షేర్లు లాభాలతో ముందుకు సాగాయి. అంతకుముందు ఏషియన్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. చైనా షాంఘై కాంపొజిట్ 0.35 శాతం, దక్షిణ కొరియా కొస్పీ 1.14, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 1.04 శాతం నష్టాలతో ముగిశాయి. అదానీ గ్రూప్ టేకోవర్ చేసిన అంబుజా సిమెంట్స్ షేర్ 10 శాతం లబ్ధి పొందింది. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ల ద్వారా వారంట్ల జారీతో రూ.20 వేల కోట్ల నిధులు సేకరించనున్నట్లు అదానీ గ్రూప్ పరకటించడమే దీనికి కారణంగా తెలుస్తున్నది.