Smartphone Exports | భారత నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఈ సుంకాల ప్రభావం భారత్లో తయారైన వస్తువులపై ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. ఓ కొత్త నివేదిక భారత టెక్ పరిశ్రమలో ఆందోళనలను రేకెత్తించింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) భారతదేశం నుంచి అమెరికాకు స్మార్ట్ఫోన్ ఎగుమతులు గణనీయంగా తగ్గాయని.. ఈ ఏడాది మే- ఆగస్టు మధ్య 58శాతం తగ్గిందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదిక పేర్కొంది. మే 2.29 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఆగస్టులో కేవలం 964.8 మిలియన్లకు పడిపోయాయి. జూన్లో ఎగుమతులు 2 బిలియన్లు, జూలైలో 1.52 బిలియన్లకు తగ్గగా.. ఆగస్టు నాటికి భారీగా తగ్గాయి. జీటీఆర్ఐ దీన్ని ఆందోళనకరమైన పరిస్థితిగా పేర్కొంది.
స్మార్ట్ఫోన్లపై కొత్త సుంకాలు విధించినందున ఈ తగ్గుదలను వెంటనే దర్యాప్తు చేయాలని పేర్కొంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆగస్టులో కొన్ని ఉత్పత్తులపై సుంకాలు విధించారు. ఈ సుంకాలు మొదట్లో 10శాతంగా ఉండగా.. ఆగస్టు 27 నాటికి 25శాతానికి పెరిగాయి. ఆగస్టు 28 తర్వాత 50శాతానికి చేరుకున్నాయి. అయితే, ఈ సుంకాలు స్మార్ట్ఫోన్లకు కాకుండా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, సీఫుడ్, రసాయనాలు, సోలార్ ప్యానెల్స్ వంటి ఉత్పత్తులకు వర్తిస్తాయి. అయినప్పటికీ, ఆగస్టు ఎగుమతుల్లో 28.5శాతం వాటా కలిగి ఉన్న సుంకం లేని ఉత్పత్తులు కూడా 41.9శాతం గణనీయమైన తగ్గుదలను చవిచూశాయి. ఈ కొత్త సుంకాల పూర్తి ప్రభావం సెప్టెంబర్లో ఉంటుందని.. ఇది ఎగుమతుల్లో మరింత తగ్గుదలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఎగుమతులు తగ్గడం కేవలం సుంకాల వల్ల మాత్రమే కాదని.. వాటి వెనుక అనేక సవాళ్లు ఉండవచ్చని.. వాటిని పరిశోధించాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది.