న్యూఢిల్లీ, ఆగస్టు 29 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. గడిచిన ఐదు త్రైమాసికాల్లో ఇదే గరిష్ఠ స్థాయి. వ్యవసాయ రంగం అంచనాలకుమించి 3.7 శాతం వృద్ధిని సాధించడం వల్లనే వృద్ధిరేటు భారీగా పుంజుకున్నదని కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ప్రపంచ దేశాల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశాల్లో తొలిస్థానంలో నిలిచింది. అమెరికా విధించిన టారిఫ్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి తగ్గే అవకాశాలున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ తెలిపారు. ప్రస్తుతేడాది భారత్ 6.3 శాతం నుంచి 6.8 శాతం మధ్యలో వృద్ధిని నమోదు చేసుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.