Q3 Results | దేశ ఆర్థికరంగం రోజురోజుకూ దిగజారుతున్నది. కేంద్ర ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉన్నదని స్పష్టంచేస్తూ ఆర్థిక రంగం పతనం దిశగా పయనిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాలే మోదీ సర్కారు పనితీరుకు అద్దం పడుతున్నాయి. భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మలుస్తున్నామని ఒకవైపు మోదీ సర్కారు ఊదరగొడుతుండగా, వాస్తవంగా మాత్రం మన ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తున్నది.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి చెందిన ఆర్థిక గణాంకాలను కేంద్రం విడుదలచేసింది. వరుసగా రెండో త్రైమాసికంలో కూడా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు తగ్గిపోయింది. జూన్-ఆగస్టు క్వార్టర్లో జీడీపీ వృద్ధిరేటు 6.3 శాతం ఉండగా, అక్టోబర్- డిసెంబర్ క్వార్టర్లో 4.4 శాతానికి పడిపోయింది. దేశంలో తయారీ రంగం ఏటా 1.1 శాతం కుంగిపోతున్నదని ఈ డాటా తేటతెల్లం చేసింది.
అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దానిని అదుపు చేసేందుకు నిరంతరం వడ్డీ రేట్లు పెంచుతుండటం తయారీరంగం పనితీరును దెబ్బతీస్తున్నాయని నిపుణులు అంటున్నారు. వీటికి తోడు మార్కెట్లో కొనుగోలు శక్తి పడిపోవటం, ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడటంతో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వచ్చే త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధిరేటు తగ్గే అవకాశం ఉన్నదని రిసర్జెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతిప్రకాశ్ గడియా అభిప్రాయపడ్డారు.
ప్రజల జీవన ప్రమాణానికి నిదర్శనంగా నిలిచే తలసరి ఆదాయ గణాంకాలు కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం 2020-21లో తలసరి ఆదాయం లేదా నికర జాతీయ తలసరి ఆదాయాన్ని రూ.1,27, 065గా, 2021-22లో రూ.1,48,524గా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,05,389. దేశ తలసరి ఆదా యం కంటే రాష్ట్రంలోనే రెట్టింపుకంటే ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం.