ముంబై, అక్టోబర్ 27: దేశీయ ఫారెక్స్ రిజర్వులు మళ్లీ క్షీణించాయి. వరుసగా నెల రోజులకుపైగా పడిపోయిన భారతీయ విదేశీ మారకపు నిల్వలు.. ఒక్క వారం పెరిగినట్టే పెరిగి తిరిగి పతనం బాటే పట్టాయి. ఈ నెల 20తో ముగిసిన వారంలో 2.36 బిలియన్ డాలర్లు దిగజారినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తెలిపిన గణాంకాల్లో తేలింది. దీంతో అక్టోబర్ 20 నాటికి దేశంలోగల ఫారెక్స్ నిల్వలు 583.53 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అంతకుముందు అక్టోబర్ 6 నుంచి 13 మధ్య 1.153 బిలియన్ డాలర్లు పెరిగాయి. అయితే మరుసటి వారమైన అక్టోబర్ 13 నుంచి 20 మధ్య అంతకు రెట్టింపు స్థాయిలో కరిగిపోయాయి. దీంతో గత నెల 1 నుంచి ఈ నెల 20 వరకు 15 బిలియన్ డాలర్లకుపైగానే దేశీయ ఫారెక్స్ నిల్వలు క్షీణించినైట్టెంది.
దేశంలోని ఫారెక్స్ రిజర్వులు ఇంకా పడిపోతే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమేనంటున్నారు మెజారిటీ ఎకానమీ ఎక్స్పర్ట్స్. విదేశీ మారకపు నిల్వలు బలంగా ఉంటే దేశానికి ఎంత లాభమో.. బలహీనపడితే కూడా అంతే ఇబ్బందులుంటాయని గుర్తుచేస్తున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సైతం తీసికట్టుగా ఉన్న ప్రస్తుత తరుణంలో దేశంలో డాలర్ నిల్వలు క్షీణించడం ఆమోదయోగ్యం కాదని చెప్తున్నారు. ముడి చమురు దిగుమతులు భారమవుతాయని, ఇదే జరిగితే ద్రవ్యోల్బణం పెచ్చుమీరి, ఆర్బీఐ వడ్డీరేట్లు పెరిగి, రుణ లభ్యత తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఇవన్నీ కూడా దేశ జీడీపీ వృద్ధికి సవాల్ విసిరేవే మరి.
ఫారెక్స్ నిల్వల పతనంపై ఆర్బీఐతోపాటు కేంద్రం దృష్టి సారించాలని, లేకపోతే మాంద్యం బారినపడటం ఖాయమని ఇప్పుడు నిపుణులు హితవు పలుకుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, గాజాపై ఇజ్రాయెల్ దాడుల మధ్య అప్రమత్తత చాలా అవసరమని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే తగిన చర్యలు తీసుకోకపోతే కోలుకోలేని దెబ్బ ఖాయమేనంటున్నారు.
