దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం ఎక్కువ రోజులు నష్టాలకే పరిమితమయ్యాయి. అయితే వరుస పతనాలతో డీలాపడిన సూచీలను ఆఖర్లో లాభాలు ముంచెత్తాయి. చివరిరోజు శుక్రవారం భారీగా పెరిగాయి. మదుపరులు లాభాల స్వీకరణ నుంచి పెట్టుబడుల దిశగా అడుగులు వేశారు. దీంతో ఓవరాల్‌గా చెప్పుకోదగ్గ లాభాలనే గత వారం మార్కెట్లు అందుకున్నాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 728.07 పాయింట్లు లేదా 0.90 శాతం పెరిగి 81,332.72 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 303.95 పాయింట్లు లేదా 1.23 శాతం అందుకుని 24,834.85 దగ్గర ముగిసింది. ఈ క్రమంలో ఈ వారం మదుపరులు ఆచితూచి అడుగులు వేయవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇక బడ్జెట్ నిర్ణయాల ప్రభావం, ఆయా సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా తమ పెట్టుబడులపై నిర్ణయం తీసుకునే వీలున్నది. అయితే సూచీలు రికార్డుస్థాయి దరిదాపుల్లో ఉన్నందున పెట్టుబడులు-ఉపసంహరణల మధ్య ఇన్వెస్టర్లు కొట్టుమిట్టాడేందుకూ అవకాశాలు లేకపోలేదు. కాగా, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఎప్పట్లాగే ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 24,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,200 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 25,100-25,300 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.