ముంబై, డిసెంబర్ 3 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ నష్టపోయాయి. విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగుతుండటం, రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోవడం మదుపరుల్లో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇంట్రాడేలో 400 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 31.46 పాయింట్లు కోల్పోయి 85,106.81 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 46.20 పాయింట్లు కోల్పోయి 25,986 వద్ద స్థిరపడింది.
ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలకు ఐటీ, బ్లూచిప్ సంస్థల షేర్ల నుంచి లభించిన మద్దతుతో చివర్లో భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. పతనమైన షేర్లలో భారత్ ఎలక్ట్రానిక్స్ 2.13 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు భారీగా నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90 స్థాయికి పడిపోవడంతో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు 1.41 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది.