ముంబై, ఏప్రిల్ 1 : దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత కొన్ని రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. త్వరలో యుద్ధం ముగిసే అవకాశాలున్నట్టు వచ్చిన వార్తలకు తోడు క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం మదుపరుల్లో సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ఫతిలంగా ఇంట్రాడేలో 2 వేల పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,186.77 పాయింట్లు లేదా 1.65 శాతం ఎగబాకి 73,134.32 పాయింట్లకు చేరుకున్నది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 348 పాయిం ట్లు లేదా 1.56 శాతం ఎగబాకి 22,679.40 పాయింట్లకు చేరుకున్నది. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.9,60,261.03 కోట్లు ఎగబాకి రూ.4,22,01,433.48 కోట్ల(4.46 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నాయి. నూతన ఆర్థిక సంవత్సరం లాభాలతో ప్రారంభించడం భవిష్యత్తులో సూచీలు కదంతొక్కే అవకాశాలున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.