రూ.లక్షల కోట్లలో కరిగిపోతున్న మదుపరుల సంపద వరుస నష్టాల్లో సూచీలు.. అదానీ, అంబానీలకు భారీ షాక్‌లు ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రూ.2.5 లక్షల కోట్ల విలువను కోల్పోయిన బడా కార్పొరేట్ సంస్థలు
ముంబై, ఫిబ్రవరి 22: భారతీయ స్టాక్ మార్కెట్లు.. మదుపరులకు షాక్ మార్కెట్లుగా తయారవుతున్నాయి. ప్రధాన సూచీలు వరుస నష్టాల్లో కదలాడుతుండటంతో లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోతున్నది మరి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లోని సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లోని నిఫ్టీ.. రెండింట్లోనూ నమోదైన కంపెనీల విలువ గతకొద్ది రోజులుగా దారుణంగా పడిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలకు ముఖ్య కారణాల్లోకి వెళ్తే.. పలు దేశ, విదేశీ పరిణామాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే అంతకంతకూ పడిపోతున్న రూపాయి మారకం విలువ, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ఇజ్రాయెల్-హమాస్ పరస్పర దాడులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలతో ఏర్పడ్డ వాణిజ్య యుద్ధం భయాలు, నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్, ఆశించిన స్థాయిలో లేని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల తగ్గింపులు, పడిపోతున్న భారత జీడీపీ, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం, పడకేసిన పారిశ్రామికోత్పత్తి వంటివి దేశీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులను పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటిదాకా సెన్సెక్స్ 2,827.95 పాయింట్లు, నిఫ్టీ 848.90 పాయింట్లు కోల్పోయాయి.
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ విలువ భారీగా పడిపోయింది. 11.9 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లపైనే) హరించుకుపోయింది. ఆ తర్వాత ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విలువ 2.94 బిలియన్ డాలర్లు (రూ.25వేల కోట్లపైనే) క్షీణించింది. దిలీప్ సంఘ్వీ, శివ్‌నాడార్, రవీ జైపూరియా వంటి బడా కార్పొరేట్ కంపెనీల విలువ సైతం బాగానే పతనమైంది. అందరిదీ కలిపితే రూ.2.5 లక్షల కోట్లదాకా నష్టం ఉంటున్నది. మరోవైపు ఈ దెబ్బకు బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో ముకేశ్ అంబానీ స్థానం 17 (87.7 బిలియన్ డాలర్లు)కు, గౌతమ్ అదానీ ర్యాంక్ 23 (66.8 బిలియన్ డాలర్లు)కు దిగజారాయి. అయితే ఇప్పటికీ ఆసియా దేశాల్లోని సంపన్నుల్లో అగ్రస్థానంలో ముకేశ్, ఆ తర్వాత అదానీయే ఉన్నారు.
విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వీలైనంత ఎక్కువగా వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. జనవరిలో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.78,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ నెల్లోనూ రూ.40,436.17 కోట్లు తరలిపోయాయి. దీంతో ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రూ.1,18,436.17 కోట్లు వెనక్కి పోయినైట్టెంది. ఇక దేశీయంగా పెట్టుబడులు పెడుతున్న ఎఫ్ఐఐల్లో సుమారు 35 శాతం అమెరికాకు చెందినవారే. అగ్రరాజ్యాధినేత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో వీరి పెట్టుబడుల ఉపసంహరణలు ఇటీవలికాలంలో పెరిగాయని చెప్పవచ్చు.
నిజానికి గడిచిన పదేండ్లలో భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐ పెట్టుబడుల వాటా 4 శాతానికిపైగా క్షీణించింది. 2015 జనవరిలో 20.2 శాతంగా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో 16 శాతంగా ఉన్నది. ఇది 12 ఏండ్ల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ నుంచి ఎఫ్ఐఐలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోనే ఉంటున్నారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు.