అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. భారతీయ స్టాక్ మార్కెట్లను గట్టిగానే ప్రభావితం చేస్తున్నది. ఇరాన్ దీటుగా బదులిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పరుగులు పెడుతుండగా.. మదుపరులు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపిస్తున్నది.
ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 4,354.98 పాయింట్లు పతనమై 74,563.92 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూ చీ నిఫ్టీ 1,299.35 పాయింట్లు క్షీణించి 23,151.10 దగ్గర ఆగింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా పెద్ద ఎత్తునే ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని చెప్పవచ్చు. ఇన్వెస్టర్లు సెల్లింగ్ ప్రెషర్‌ను ఎదుర్కొంటారన్న అభిప్రాయాలు మెజారిటీ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రధానంగా చమురు-గ్యాస్, మెటల్, ఆటో, రిటైల్ రంగ షేర్లు పెట్టుబడుల ఉపసంహరణకు గురికావచ్చంటున్నారు.
ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, విదేశీ మదుపరుల పెట్టుబడులూ కీలకమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కొనసాగితే నిఫ్టీకి 22,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,500 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,500-23,700 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.