న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను తరలించుకుపోతుండటం, కార్పొరేట్ల నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో దేశీయ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు 14 శాతం వరకు నష్టపోయాయి. గతేడాది సెప్టెంబర్ 27న సెన్సెక్స్ 85,978.25 పాయింట్లకు, నిఫ్టీ 26,277.35 పాయింట్ల రికార్డు స్థాయికి చేరుకున్నది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్ 11,376.13 పాయింట్లు లేదా 13.23 శాతం, నిఫ్టీ 3,729.80 పాయింట్లు లేదా 14.19 శాతం చొప్పున పతనం చెందాయి. సూచీలు పతనం చెందడంతో లక్షల కోట్ల సంపదను మదుపరులు కోల్పోయారు. మరోవైపు, దేశీయ ఎగుమతులపైన కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లను విధించడానికి సిద్ధమవుతుండటం కూడా సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎఫ్ఐఐలు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి లక్ష కోట్ల రూపాయలను తరలించుకుపోయారు.