Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమ్మకాలతో ఒత్తిడితో మార్కెట్లు పతనమయ్యాయి. క్రితం సెషన్లో పోలిస్తే స్వల్ప నష్టాలతో మొదలైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. గురువారం ఉదయం సెన్సెక్స్ 84,750.90 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 84,906.95 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. అత్యల్పంగా 84,312.65 పాయింట్లకు పడిపోయింది. చివరకు 592.67 పాయింట్లు తగ్గి.. 84,404.46 వద్ద ముగిసింది. నిఫ్టీ176.05 పాయింట్లు తగ్గి.. 25,877.85 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,808 షేర్లు రాణించగా.. 2,167 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ ఒక్కొక్కటి 0.1 శాతం పడిపోయాయి. హెల్త్‌కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా స్టాక్స్ భారీగా నష్టపోయాయి. నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.81 శాతం పడిపోయింది.
ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 0.7 శాతం తగ్గాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటోరంగాల షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. రియాల్టీ మాత్రమే స్వల్పంగా లాభపడింది. 0.13శాతం పెరిగింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్, గ్యాస్ సూచీలు స్వల్పంగా దిగజారాయి. నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో కోల్ ఇండియా, లార్సెన్, భారత్ ఎలక్ట్రికల్స్, హిందాల్కో, నెస్లే, మారుతి సుజుకీ, టీఎంపీవీ, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, జేఎస్ డబ్ల్యూ సిమెంట్ లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, భారతి ఎయిర్టెల్, ఇంటర్‌గ్లోబ్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి.