Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరు రోజుల లాభాల తర్వాత నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల పవనాలతో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అమ్మకాలతో అస్థిరతకు గురయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం 85,042.37 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. ఇంట్రాడేలో 85,042.41పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. 84,558.36 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. చివరకు 277.93 పాయింట్ల నష్టంతో 84,673.02 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం 103.40 పాయింట్లు తగ్గి 25,910.05 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒకశాతం తగ్గింది. అయితే, నిఫ్టీ మిడ్‌క్యాప్ 61,220.25 పాయింట్ల సరికొత్త రికార్డు గరిష్ట స్థాయిని తాకిన తర్వాత 0.6 శాతం దిగువన ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఇంట్రాడేలో 59,103.65 తాజా గరిష్ట స్థాయిని తాకిన తర్వాత స్వల్ప నష్టాలతో ముగిసింది. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్, రియాల్టీ ఒక్కొక్కటి ఒకశాతం తగ్గాయి. నిఫ్టీలో భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్ ప్రధాన లాభాలను ఆర్జించాయి. టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్, జియో ఫైనాన్షియల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టపోయాయి.