Smart Phones Usage | ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల యుగం.. వాట్సాప్ మెసేజింగ్.. వీడియో కాలింగ్ మొదలు యుటిలిటీ బిల్లులు అంటే విద్యుత్ చార్జీలు.. పెట్రోల్ బిల్లు, షాపింగ్, ఆన్లైన్లో వివిధ ఉత్పత్తులు, సేవల కొనుగోలుకోసం చార్జీలు చెల్లించాలంటే స్మార్ట్ ఫోన్ పైనే ప్రతి ఒక్కరూ ఆధార పడుతున్నారు. భారత్లో స్మార్ట్ ఫోన్ యూజర్లు వాటి వినియోగానికి చేసే ప్రతి రూపాయి ఖర్చుపై ఆరు రూపాయలు లబ్ధి పొందుతున్నారని ఓ సర్వే తేల్చింది.
భారత్లో మధ్యతరగతి కుటుంబాలతో పోలిస్తే సంపన్నులే స్మార్ట్ ఫోన్లకు 50 శాతం ఎక్కువ విలువ ఇస్తున్నారు. మధ్యతరగతి వారు 10.1 రెట్లు లబ్ధి పొందితే, సంపన్నులకు 22.5 రెట్లు బెనిఫిట్లు కలుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్లతో ప్రజలు పలు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది.
స్మార్ట్ ఫోన్ యూజర్లు ప్రాధాన్యాలు, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి వివో ఇండియా ‘ఎకనమిక్ వాల్యూ ఆఫ్ స్మార్ట్ ఫోన్’ అనే అంశంపై మరో సంస్థతో కలిసి సర్వే నిర్వహించింది. 14 మెట్రో, నాన్ మెట్రో నగరాల పరిధిలోని 1000 మంది విభిన్న యూజర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది.
అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ-ఎన్సీఆర్, జైపూర్, హైదరాబాద్, కాన్పూర్, కోల్ కతా, లక్నో, ముంబై, నాగ్ పూర్, పుణె, సూరత్ నగరాల్లో ఈ సర్వే సాగింది. పారిశ్రామికవేత్తల నుంచి నిపుణులు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులు, గృహిణుల అభిప్రాయాలు సేకరించారు. 18-60 ఏండ్ల మధ్య వయస్కుల వరకు.. 62 శాతం మంది పురుషుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. డిజిటల్ వేదికగా సాగే సర్వీసుల బుకింగ్, ఉద్యోగుల నియామకాలు లాభదాయకం కాగా, పెట్టుబడులపై ఎనిమిది రెట్లు రిటర్న్స్ లభించాయని ఈ సర్వే తేల్చింది.