అమెరికా డాలర్ ముందు భారతీయ రూపాయి ఏమాత్రం నిలబడలేకపోతున్నది. ఫలితంగా చారిత్రక కనిష్ఠాలకు దిగజారుతున్న దేశీయ కరెన్సీతో ద్రవ్యోల్బణం విజృంభించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారిప్పుడు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరుగుతూపోతుండగా.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సామాన్యుడి బడ్జెట్ తలకిందులు కావడం ఖాయం. ఇక భారమయ్యే దిగుమతులతో దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బే.
న్యూఢిల్లీ, డిసెంబర్ 4 : డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠాలకు పడిపోతున్నది. బుధవారం మునుపెన్నడూ లేనివిధంగా ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద భారతీయ కరెన్సీ 90.15గా ముగిసింది. ఒకానొక దశలోనైతే 90.30 స్థాయికి క్షీణించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతకొద్ది నెలలుగా అమెరికా కరెన్సీకి డిమాండ్‌తో రూపీ వాల్యూ అంతకంతకూ పతనమైపోతున్న విషయం తెలిసిందే.
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం.. దేశంలో ధరలను ఎగదోస్తుంది. విదేశాల నుంచి వచ్చే ప్రతీ వస్తూత్పత్తి, ముడి సరకుల దిగుమతులకు అధిక మొత్తంలో చెల్లించాల్సిన దుస్థితి తలెత్తుతుంది. దీనివల్ల మార్కెట్లో ఆయా ఉత్పత్తులు, సేవల ధరలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలు 80 శాతం వరకు ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురుతోనే తీరుతున్నాయి. ఈ క్రమంలో రూపాయి బలహీనత క్రూడాయిల్‌ను ఖరీదెక్కిస్తుంది. దీంతో చమురు శుద్ధి కంపెనీలూ పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాల రేట్లను పెంచాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా వ్యయం పెరిగి ప్రతీ వస్తువు ధరను అది ప్రభావితం చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని, దీన్ని తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మళ్లీ కఠిన ద్రవ్య వైఖరిని అవలంబించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇదే జరిగితే వడ్డీరేట్లు పెరిగి రుణ లభ్యత కష్టతరంగా మారుతుంది. వ్యక్తిగత, వ్యాపార, ఇతరత్రా రుణాలపై చెల్లించే వడ్డీ భారం పెరుగుతుంది. దీంతో గృహ, వాహన, ఇతర కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కొనుగోళ్లు తగ్గిపోతాయి. చివరకు వాటి ఉత్పత్తీ పడిపోవడం వల్ల ఉద్యోగ కోతలతో నిరుద్యోగం పెచ్చుమీరే ప్రమాదం ఉందన్నది ఎక్స్పర్ట్స్ మాట. ఇలా అన్ని రంగాలపై రూపాయి ప్రభావం ఉంటుందని, కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థకూ రూపాయి విలువ క్షీణత గట్టి దెబ్బని వారు పేర్కొంటున్నారు. రూపీకి ఇబ్బందికరంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలను చక్కదిద్దడం మన చేతుల్లో లేదు కాబట్టి.. ఆర్బీఐ జోక్యంతోనైనా రూపాయిని బలపర్చాల్సిన అవసరం ఉందని ఇప్పుడు మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రూపాయి దెబ్బకు సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతున్నది. నిన్నమొన్నటి ధరలు నేడు ఉండకపోవడంతో సగటు మనిషి జేబుకు చిల్లులు తప్పడం లేదు మరి. ఆదాయం అంతంతమాత్రంగా ఉండే పేద, మధ్యతరగతి ప్రజానీకం కష్టాలు అన్నీఇన్నీ కావు. నెలనెలా పెరుగుతూపోతున్న ఖర్చులు.. కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని దుస్థితికి నెడుతున్నాయి. అసలే మార్కెట్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నానాటికీ కరువైపోతున్నాయి. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. మానవ వనరుల అవసరాలను ప్రతి రంగంలోనూ పరిమితం చేస్తున్నంది. దీంతో పెరిగే ఇంటి నిర్వహణ వ్యయ భారం.. భారతీయులకు పెద్ద తలనొప్పిగా పరిణమిస్తున్నదని నిపుణులు చెప్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించకపోతే సమీప భవిష్యత్తులో పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తుండటం గమనార్హం. ప్రజా పొదుపు, పెట్టుబడులపైనా దుష్ప్రభావం చూపుతుందని అంటున్నారు.

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం ట్రేడింగ్‌లోనూ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఈ క్రమంలోనే ఒకానొక దశలో తొలిసారి 90.43 స్థాయికి పడిపోయి ఆల్‌టైమ్ ఇంట్రా-డే కనిష్ఠ స్థాయి రికార్డును నెలకొల్పింది. అయితే చివరకు కోలుకున్నది. బుధవారం ముగింపుతో చూస్తే 26 పైసలు బలపడి 90 మార్కుకు దిగువన 89.89 వద్ద స్థిరపడింది. నాడు మునుపెన్నడూ లేనివిధంగా 90.15 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. రూపాయి పతనం.. పార్లమెంట్‌నూ షేక్ చేస్తున్నది. ఈ క్రమంలోనే ఈ అంశంపై ఆయా రాజకీయ పార్టీల నేతలు మీడియా, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
రూపీ విలువ క్షీణతపై గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. మరి ఇప్పుడు డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 90 మార్కును దాటిపోయింది. దీనిపై ఏమంటారు. మోదీ సర్కారు విధానాల వైఫల్యమే ఇందుకు కారణం. రోజురోజుకు చారిత్రక కనిష్ఠాలకు పడిపోతున్న రూపాయి విలువ దేశ అసలైన ఆర్థిక దుస్థితిని తెలియజేస్తున్నది.
మన్మోహన్ సింగ్ హయాంలో రూపాయి తీరుతెన్నులపై ఇష్టారీతిన మాట్లాడినవారు ఇప్పుడు ఏమంటారు? డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 90ని దాటడం బీజేపీ వైఫల్యమే.
రూపాయి నష్టాలు దేశంలోని సామాన్యులకు ఆర్థికంగా కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. భారత చరిత్రలోనే తొలిసారి 90 స్థాయిని మించి మారకపు విలువ క్షీణించింది. ఇది నిజంగా ఆందోళనకరం.