ముంబై, డిసెంబర్ 26: వాణిజ్యలోటు దిగిరావడం, సర్వీసుల ఎగుమతులు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) భారీగా తగ్గింది. ఈ మూడు నెలల కాలంలో ఇది జీడీపీలో 1 శాతానికి (8.3 బిలియన్ డాలర్లు) చేరినట్టు మంగళవారం విడుదలైన రిజర్వ్‌బ్యాంక్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌లో జీడీపీలో 3.8 శాతం (30.9 బిలియన్ డాలర్లు) క్యాడ్ నమోదయ్యింది. దేశంలోకి వచ్చి, పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య వ్యత్యాసాన్ని కరెంట్ ఖాతా లోటుగా వ్యవహరిస్తారు.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్‌లో ఇది జీడీపీలో 1.1 శాతం (9.2 బిలియన్ డాలర్లు). 2022-23 క్యూ2లో 78.3 బిలియన్ డాలర్లున్న వాణిజ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 61 బిలియన్ డాలర్లకు తగ్గగా, సాఫ్ట్వేర్, బిజినెస్, ట్రావెల్ తదితర సర్వీసుల ఎగుమతులు 4.2 శాతం వృద్ధిచెందినట్టు ఆర్బీఐ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల నుంచి వచ్చిన రెమిటెన్సులు గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 2.6 శాతం పెరిగి 28.1 బిలియన్ డాలర్లకు చేరాయి. దేశంలో పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయం చెల్లింపులు 11.8 బిలియన్ డాలర్ల నుంచి 12.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఖాతాలో నికరంగా 0.3 బిలియన్ డాలర్లు దేశం నుంచి తరలివెళ్లాయి. నిరుడు క్యూ1లో దేశంలోకి 6.2 బిలియన్ డాలర్లు తరలివచ్చాయి. ఇక విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు 6.5 బిలియన్ డాలర్ల నుంచి 4.9 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
కార్పొరేట్లు తీసుకున్న విదేశీ వాణిజ్య రుణాల మొత్తం 1.8 బిలియన్ డాలర్లు దేశంలోకి రాగా, గత ఏడాది ఈ ఖాతా నుంచి 0.5 బిలియన్ డాలర్లు వెలుపలికి వెళ్లాయి. ప్రవాసుల డిపాజిట్లు 2.5 బిలియన్ డాలర్ల నుంచి 3.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. సమీక్షా త్రైమాసికంలో విదేశీ మారక నిల్వలు 2.5 బిలియన్ డాలర్లు పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది. నిరుడు ఇదే సమయంలో 30.4 బిలియన్ డాలర్ల నిల్వలు తరిగిపోయాయి. కమోడిటీ ధరలు పెరగకపోతే, ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరంలో క్యాడ్ జీడీపీలో 1.5-1.6 శాతం మేర ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ చెప్పారు.