RBI on Banks | రుణపరపతి కల్పన కోసం ఆర్బీఐ మద్దతుపై బ్యాంకులు శాశ్వతంగా ఆధారపడొద్దని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. తమ రుణ పరపతి లక్ష్యాల సాధన కోసం బ్యాంకులు మరిన్ని డిపాజిట్లు సేకరించాల్సిన అవసరం ఉందని శుక్రవారం మీడియాకు చెప్పారు. బ్యాంకులు అధిక డిపాజిట్లు సేకరించినప్పుడు మాత్రమే రుణ పరపతి కల్పించడానికి నిలకడ లభిస్తుందన్నారు. బ్యాంకులు తమ సొంత ఆదాయ మార్గాల్లో నిధులు సమకూర్చుకోవాలని తెలిపారు.
ఆర్బీఐ రెపోరేట్ పెంచుతుండగానే బ్యాంకులు తమ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేస్తున్నాయని, ఈ ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నట్లు శక్తికాంతదాస్ అన్నారు. ఆర్బీఐ శుక్రవారం 50 బేసిక్ పాయింట్ల రెపోరేట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మే నెల నుంచి ఆర్బీఐ రెపోరేట్ పెంచడం ఇది మూడోసారి. తాజాగా 50 బేసిక్ పాయింట్లు పెంచడంతో ఆర్బీఐ రెపోరేట్ 5.40 శాతానికి చేరుకున్నది.
వినియోదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్లో 7.01 శాతంగా నిలిచింది. అంతకుముందు మేలో 40 బేసిక్ పాయింట్లు, జూన్లో 50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచేసింది ఆర్బీఐ. రెపోరేట్ల పెంపునకు పలు బ్యాంకులు తమ డిపాజిట్ పథకాలపై వడ్డీ పెంచేశాయి. బ్యాంకులు దూకుడుగా డిపాజిట్లు సేకరిస్తున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మిచైల్ పాత్ర చెప్పారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం జూలై 15 నాటికి బ్యాంకుల రుణ పరపతి 12.89 శాతం పెరిగి రూ.122.81 లక్షల కోట్లకు, డిపాజిట్లు 8.35 శాతం వృద్ధి చెంది రూ.168.09 లక్షల కోట్లకు చేరాయి.