న్యూఢిల్లీ, జనవరి 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.2,119 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాంక్. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,396 కోట్లతో పోలిస్తే 52 శాతం వృద్ధిని సాధించింది. సమీకృత ఆదాయం పెరగడం, మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. క్రితం ఏడాది రూ.13,551 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికంలో రూ.16,099 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో వడ్డీల మీదనే రూ.14,198 కోట్ల ఆదాయం సమకూరాయి. స్థూల నిరర్థక ఆస్తుల విలువ 6.53 శాతం నుంచి 4.47 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ కూడా 1 శాతం నుంచి 0.53 శాతానికి దిగొచ్చాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ నిధుల కేటాయింపులు రూ.1,474 కోట్ల నుంచి రూ.906 కోట్లకు తగ్గాయి.