IMF Gita Gopinath | భారత్ వృద్ధిరేటు కొనసాగాలంటే మరిన్ని ఆర్థిక సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపినాథ్ స్పష్టం చేశారు. తద్వారా మాత్రమే దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. సంపన్న దేశాలతో పోలిస్తే భారత్ పరోక్ష పన్నుల ద్వారా ఆదాయం పెంచుకుంటున్నదని అన్నారు. కానీ విదేశాలు వ్యక్తిగత ఆదాయం పన్ను ద్వారా అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నాయన్నారు. భారత్ సైతం ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
ఇక ఉద్యోగాల కల్పనలో జీ-20 దేశాల్లో భారత్ వెనుక బడి ఉందని గీతా గోపినథ్ పేర్కొన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా 2030 నాటికి భారత్ అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో గీతా గోపినాథ్ చర్చించారు. తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వజ్రోత్సవాల్లో గీతా గోపినాథ్ మాట్లాడుతూ 2010 నుంచి ప్రతియేటా భారత్ వృద్ధిరేటు సగటున 6.6 శాతంగా ఉన్నా, ఉపాధి కల్పన మాత్రం రెండు శాతం లోపే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీ-20 దేశాల కంటే ఉద్యోగాల కల్పనలో వెనుకబడి ఉన్న భారత్.. 2030 నాటికి ఆరు కోట్ల నుంచి 14.8 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇప్పటికే మనం 2024లోకి వచ్చేశామని, భారీగా ఉద్యోగాల కల్పనకు చాలా తక్కువ టైం ఉందన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో భారత్ కీలక పాత్ర పోషించాలంటే.. వివిధ వస్తువులపై దిగుమతి సుంకాలు తగ్గించాల్సిన అవసరం ఉందని గీతా గోపినాథ్ నొక్కి చెప్పారు. ఇప్పటికే సంస్థాగత సంస్కరణలతో గణనీయ పురోగతి సాధించిన భారత్.. ఇతర దేశాలతో పోలిస్తే అధిక దిగుమతి సుంకాలు వసూలు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశం హోదా కోసం భారత్ భారీగా ఆశలు పెట్టుకున్నదని, అయితే, అందుకోసం చాలా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. పలు రంగాల్లో మెరుగు పడాల్సి ఉందన్నారు.
‘భారత్ వృద్ధి చెందుతుంది. ఏటా ఓవరాల్ గా ఏడు శాతం వృద్ధి సాధిస్తోంది. ప్రపంచంలోకెల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. భారతీయుల తలసరి ఆదాయం పెంపు దిశగా ఈ వృద్ధిరేటును ఎలా ముందుకు తీసుకెళ్లగలదన్న అంశంపైనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి’ అని గీతా గోపినాథ్ చెప్పారు.
Redmi A3x | రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఏ3ఎక్స్.. ధరెంతంటే..?!
Jeep India Discounts | ఆ రెండు కార్లపై జీప్ ఇండియా డిస్కౌంట్.. గరిష్టంగా ఎంతంటే..?!
Kia India | కియా ఇండియా నుంచి రెండు ప్రీమియం కార్లు.. అక్టోబర్ 3న లాంచింగ్..!