లండన్, జూలై 24 : భారత్-బ్రిటన్ మధ్య గురువారం చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్తో లండన్‌లో జరిపిన చర్చల నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక బిజినెస్ డీల్ చోటుచేసుకున్నది. ఈ సందర్భంగా ఒప్పందంపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, బ్రిటన్ వ్యాపార-వాణిజ్య శాఖ మంత్రి జోనాథన్ రెనాల్డ్స్ సంతకాలు చేశారు. కాగా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలగిన తర్వాత ఏ దేశంతోనైనా బ్రిటన్ చేసుకున్న ఒప్పందాల్లో ఇదే అతిపెద్దది. ఇక బ్రిటన్ ప్రధాని స్టార్మర్తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ ఎఫ్టీఏతో భారత్-బ్రిటన్ వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 34 బిలియన్ డాలర్లకు చేరగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ఈ క్రమంలోనే 2030 నాటికి 120 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఒప్పందంతో ఇరు దేశాలకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు కలుగుతాయన్న విశ్వాసాన్ని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ వ్యక్తం చేశారు. అలాగే ఈ ఎఫ్టీఏతో బ్రిటన్‌కు ఎగుమతి అవుతున్న 99 శాతం భారతీయ వస్తూత్పత్తులపై సుంకాల భారం తప్పుతుందని వాణిజ్య మంత్రి గోయల్ అన్నారు.
బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారతీయ మార్కెట్లోకి ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఆయా వస్తూత్పత్తుల ధరలు దిగిరానున్నాయి. ఇందులో ఏరోస్పేస్ విడిభాగాలు, వైద్య పరికరాలు, సాఫ్ట్ డ్రింక్స్, కాస్మటిక్స్, లగ్జరీ కార్లు, స్కాచ్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బ్రిటన్ నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న వాటిపై సగటున 15 శాతం సుంకాలు పడుతున్నాయి. అయితే ఎఫ్టీఏతో ఈ సుంకాలు 3 శాతానికి దిగిరానున్నాయి. అలాగే ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన వెంటనే బ్రిటన్ విస్కీపై విధిస్తున్న 150 శాతం సుంకం.. 75 శాతానికి పడిపోనున్నది. అంతేగాక వచ్చే పదేండ్లలో ఇది క్రమేణా 40 శాతానికి దిగివస్తుంది.
ఎఫ్‌టీఏ నేపథ్యంలో బ్రిటన్‌లోని భారతీయ సంస్థలు, ఫ్రీలాన్సర్లకు 36 రంగాల్లో ఇక ‘ఎకనామిక్ నీడ్స్ టెస్ట్’ అవసరం లేదు. అంతేగాక 35 రంగాల్లో రెండేండ్లపాటు భారతీయ నిపుణులు ఆ దేశంలో కనీసం ఓ ఆఫీస్‌ను కూడా పెట్టుకోకుండా పనిచేసుకోవచ్చు. అలాగే మూడేండ్లు అక్కడి సామాజిక భద్రత చెల్లింపుల నుంచి మినహాయింపునూ పొందవచ్చు. కాగా, భారత్‌లో బ్రిటన్ ఆరో అతిపెద్ద విదేశీ మదుపరిగా ఉన్నది. అక్కడి కంపెనీలు ఇక్కడ దాదాపు 36 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని పెట్టాయి. అలాగే బ్రిటన్‌లో వెయ్యికి భారతీయ సంస్థల కార్యకలాపాలు సాగుతున్నాయి. 2 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టగా, లక్ష మందికిపైగా ఉద్యోగాల్నిచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) బ్రిటన్‌కు భారత ఎగుమతులు 12.6 శాతం పెరిగి 14.5 బిలియన్ డాలర్లకు చేరాయి. భారత్‌కు బ్రిటన్ నుంచి దిగుమతులూ 2.3 శాతం ఎగిసి 8.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2023-24లో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 21.34 బిలియన్ డాలర్లుగా ఉన్నది. అంతకుముందు ఇది 20.36 బిలియన్ డాలర్లు.