ముంబై, సెప్టెంబర్ 19: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) దేశ జీడీపీలో 3.4 శాతం లేదా 28.4 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ సోమవారం అంచనా వేసింది. ఇది 36 త్రైమాసికాల (తొమ్మిదేండ్లు) గరిష్ఠానికి సమానం కావడం గమనార్హం. 2013-14 తొలి త్రైమాసికంలో 4.7 శాతంగా ఉన్నది.
అయితే మళ్లీ ఆ దరిదాపుల్లోకి ఈసారి క్యాడ్ వెళ్లవచ్చన్న అభిప్రాయం ఇండియా రేటింగ్స్ నుంచి వస్తున్నది. 2012-13 అక్టోబర్-డిసెంబర్లోనూ 31.8 బిలియన్ డాలర్లుగా క్యాడ్ ఉన్నట్టు గుర్తుచేస్తున్నది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్-జూన్లో 0.9 శాతం (6.6 బిలియన్ డాలర్లు)గానే నమోదైన విషయం తెలిసిందే. ఈ జనవరి-మార్చిలో పెరిగినా 1.5 శాతం (13.4 బిలియన్ డాలర్లు) వద్దే ఉన్నది. దేశ ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ అధికంగా ఉండటమే కరెంట్ ఖాతా లోటు. దేశీయ దిగుమతుల్లో ముడి చమురు వాటానే ఎక్కువన్న సంగతి విదితమే.