న్యూఢిల్లీ, మే 21: జూలై 8కల్లా భారత్-అమెరికా నడుమ మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే వీలుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ప్రతీకార సుంకాలకు తెరతీసిన విషయం తెలిసిందే. అయితే ఆయా దేశాలతో వాణిజ్య చర్చల్లో భాగంగా జూలై 9దాకా (90 రోజులపాటు) సదరు సుంకాల అమలును వాయిదా వేసిన సంగతీ విదితమే. ఈ క్రమంలోనే భారత్‌పై విధించిన 26 శాతం అదనపు సుంకాలు ఆగిపోయాయి. అయినప్పటికీ 10 శాతం బేస్‌లైన్ టారిఫ్‌లు మాత్రం పడుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో అమెరికాతో ట్రేడ్ డీల్‌కు మోదీ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, జూలై 8కల్లా ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు కనబర్చారు. ప్రతీకార సుంకాల నుంచి పూర్తిగా ఉపశమనం లభించేలా కృషి చేస్తున్నట్టు ఆయన తాజాగా తెలిపారు. చర్చలు జరుగుతూనే ఉన్నాయన్నారు. నిజానికి ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ అమెరికాకు వెళ్లి అక్కడి వాణిజ్య మంత్రితో ఈ విషయమై చర్చలు జరిపినది తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటివరకైతే ఎలాంటి ఫలితం లేకుండా ఉన్నది. మరి ప్రతీకార సుంకాల తొలగింపునకు ట్రంప్ సర్కారు ఏమాత్రం అంగీకరిస్తుందో చూడాలి.