హైదరాబాద్/న్యూఢిల్లీ, ఆగస్టు 7 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులకు విధించిన సుంకాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, సీనియర్ ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు స్పందించారు. బుధవారం టారిఫ్‌లను ట్రంప్ 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా దువ్వూరి మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఆ తీవ్రత కనిపించకపోయినా.. మధ్య, దీర్ఘకాలానికిగాను భారత్‌పై ఈ ప్రభావం గట్టిగానే ఉండొచ్చన్నారు. దేశ జీడీపీలో ఎగుమతుల వాటా దాదాపు 22 శాతంగా ఉందన్న ఆయన.. ఇందులో 17 శాతం అమెరికాకే ఎగుమతి అవుతున్నట్టు గుర్తుచేశారు. కాబట్టి ఈ సుంకాలతో ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) భారత జీడీపీ అర శాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గిపోవచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25) దేశ జీడీపీ 6.5 శాతంగా నమోదైన దృష్ట్యా ఈసారి అది 6 శాతానికి పరిమితం కావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వృద్ధిరేటు కూడా తీసిపారేయదగినదేమీ కాదన్న ఆయన.. సుంకాల భారం ఇలాగే కొనసాగితే మాత్రం ఏటా అర శాతం చొప్పున దేశ జీడీపీ వృద్ధిరేటు క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించడం గమనార్హం. ఇదే జరిగితే వికసిత భారత్ లేదా 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత కలలు కల్లలేనని దువ్వూరి వ్యాఖ్యానించారు.
సుంకాల భారం పెరిగితే దేశీయ మెషినరీ, మెకానికల్ అప్లియెన్సెస్, రత్నాలు-ఆభరణాల వంటి కార్మిక ఆధారిత రంగాలు కుదేలవుతాయని దువ్వూరి సుబ్బారావు అన్నారు. దీంతో అల్పాదాయ వర్గాల జీవనోపాధి ప్రమాదంలో పడవచ్చని చెప్పారు. ఇది అన్ని రకాలుగా చాలాచాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో నిరుద్యోగం పెరిగితే అది ఇంకా ప్రమాదమేనని, ఈ సుంకాల పోరు ఎక్కడికెళ్తుందోనన్న ఆందోళనలు ఇప్పటికే ఆయా వ్యాపార, పారిశ్రామిక, ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కాగా, 2024-25లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లు (సేవ రంగ ఎగుమతులు, దిగుమతులు మినహా)గా ఉన్నది. ఇందులో 86.5 బిలియన్ డాలర్లు అమెరికాకు భారత ఎగుమతులుంటే, 45.3 బిలియన్ డాలర్లు భారత్‌కు అమెరికా ఎగుమతులున్నాయి.
రష్యా నుంచి భారత్ చౌకగా ముడి చమురును కొంటున్నదని, ట్రంప్ బెదిరింపులకు భయపడి దీనికి బదులుగా సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి క్రూడాయిల్‌ను కొంటే ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని దువ్వూరి అన్నారు. అప్పుడు దేశంలో ద్రవ్యోల్బణం విజృంభించే వీలుందని, ఇది యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయగలదని తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాలకూ ఇది ఇబ్బందికరంగా మారగలదని హెచ్చరించారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు, సంబంధాలు ఎలా ఉన్నా.. ఇతర దేశాలతో ట్రేడ్, వ్యాపార లావాదేవీలను బలోపేతం చేసుకోవాలి. వీలైనన్ని దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉత్తమం. కొత్త మార్కెట్లను, అక్కడున్న అవకాశాలను అన్వేషించాలి. తద్వారా ఎగుమతులను విస్తరించాలి. పర్యాటకులను ఆకట్టుకునేలా దేశంలో మౌలిక సదుపాయాలను పెంపొందించుకోవాలి. యూరోపియన్ దేశాలు (ఈయూ), తూర్పు ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అలాగే ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్యం కోసం సమగ్ర, ప్రగతిదాయక ఒప్పందం (సీపీటీపీపీ)పై దృష్టి పెట్టాలి. సీపీటీపీపీలో చేరితే ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, జపాన్, మలేషియా, మెక్సికో, న్యూజీలాండ్, పెరు, సింగపూర్, వియత్నాం తదితర 12 దేశాలతో స్చేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినట్టే.
అమెరికా మార్కెట్లోకి భారత్ నుంచి వచ్చే దుస్తులు, వస్ర్తాలపై ట్రంప్ సర్కారు 50 శాతం సుంకాలు వేస్తే.. దేశంలోని చిన్న సంస్థలకు చావుదెబ్బేనని దుస్తుల ఎగుమతి, ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) చైర్మన్ సుధీర్ శేఖ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. సూక్ష్మ, మధ్యతరహా సంస్థలకు ట్రంప్ టారిఫ్‌లు మరణ శాసనంగా మారుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే బాధిత పరిశ్రమలకు ఆర్థిక చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని అప్పారెల్ ఇండస్ట్రీపై లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని, ఈ సుంకాల పోరులో వారంతా రోడ్డునపడే దుస్థితి నెలకొనేలా ఉందని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గత ఏడాది (2024) భారతీయ రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో అమెరికా వాటానే 33 శాతంగా ఉన్నట్టు గుర్తుచేశారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25) అమెరికాకు భారత్ నుంచి ఈ రంగం ఎగుమతులు 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు. 2020లో అమెరికా మార్కెట్లో భారత్ గార్మెంట్స్ వాటా 4.5 శాతంగా ఉంటే.. 2024లో 5.8 శాతానికి పెరిగినట్టు వివరించారు. ఈ విషయంలో భారత్ నాల్గో స్థానంలో ఉన్నట్టు చెప్పారు.
అమెరికాకు వచ్చే కంప్యూటర్ చిప్స్, సెమీకండక్టర్ల దిగుమతులపై 100% సుంకాలు విధించే యోచనలో ఉన్నారు ట్రంప్. ఈ మేరకు టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో ట్రంప్ అన్నట్టు తెలుస్తున్నది. అమెరికాలోనే చిప్స్, సెమీకండక్టర్ల తయారీ చేపట్టాలని, అప్పుడు ఈ సుంకాల నుంచి తప్పించుకోవచ్చని ఇండస్ట్రీకి ట్రంప్ సర్కారు సూచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఇన్నాళ్లూ చైనా, తైవాన్ తదితర దేశాల్లో ఉత్పత్తి చేస్తూ వచ్చిన యాపిల్.. ట్రంప్ ఒత్తిళ్ల నడుమ అమెరికాలో తమ తయారీ కేంద్రాలను పెంచే దిశగా అడుగులేస్తున్నది.
భారతీయ ఆటో కంపొనెంట్స్ ఇండస్ట్రీకి అమెరికా ప్రధాన మార్కెట్‌గా ఉన్నది. అయితే ట్రంప్ టారిఫ్‌లు సమీప కాలంలో ఆటో కంపొనెంట్స్ తయారీదారులకు పెను సవాళ్లుగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెరికా మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల మార్కెట్లను అన్వేషించడం మంచిది.
ట్రంప్ టారిఫ్‌లతో భారతీయ రత్నాలు, ఆభరణాల రంగం కుదేలవుతున్నది. ఇండస్ట్రీకి అమెరికానే అతిపెద్ద మార్కెట్. కనుక ఈ సుంకాల భారాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. పాలసీపరమైన సంస్కరణలను తెచ్చి పరిశ్రమను ఆదుకోవాలి. లేకపోతే ఈ రంగంపై ఆధారపడిన వేలాదిమంది రోడ్డునపడే ప్రమాదం ఉన్నది.
భారతీయ పశుసంపద, సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ మార్కెట్లను చూసుకోవాలి. బ్రిటన్ తదితర దేశాల్లో విస్తరించాలి. కేంద్ర ప్రభుత్వం సైతం పరిశ్రమలకు అండగా నిలవాలి. ట్రంప్ టారిఫ్‌లతో ఈ రంగాలపై విపరీతమైన భారం పడుతున్నది మరి. సుంకాల పెంపు ఇలాగే ఉంటే దేశంలోని లక్షలాది గ్రామీణ, తీరప్రాంత ప్రజల జీవనోపాధికి తీవ్రమైన ఇబ్బందులే వస్తాయి.
ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు రొయ్యలు, ఆర్గానిక్ కెమికల్స్, దుస్తులు, ఆభరణాలు తదితర 9 రంగాల ఎగుమతులపై 50-70 శాతం ప్రభావాన్ని చూపవచ్చు. అదనపు టారిఫ్‌లతో అమెరికాలో భారతీయ వస్తూత్పత్తులపై అధిక సుంకా లు పడుతాయి. వాటి గిరాకీ పడిపపోతుం ది. అల్యూమినియం, కాపర్, ఆటో విడిభాగాల ఎగుమతులూ దెబ్బతింటాయి.
ప్రస్తుతానికైతే భారతీయ ఔషధ రంగ ఎగుమతులకు ట్రంప్ టారిఫ్‌ల నుంచి మినహాయింపున్నది. అమెరికాలోని ఔషధ వినియోగంలో భారతీయ జనరిక్ మందుల వాటానే 40 శాతానికిపైగా ఉంటుంది. కాబట్టి టారిఫ్‌లను పెంచితే ఆ భారం చివరకు అమెరికన్లపైనే పడుతుంది. దేశీయ తయారీదారులు చౌకగా వీటిని ఎగుమతి చేస్తున్నారు మరి.