UPI Payments | డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతున్నది. యూపీఐ పేమెంట్స్‌లో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. భారత్‌లో ప్రతినెలా రూ.1800 కోట్లకుపైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొంది. ‘ది రైజ్ ఆఫ్ రిటైల్ డిజిటల్ పేమెంట్స్: ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్ఆపరబిలిటీ’ పేరుతో ఐఎంఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది. యూపీఐ ద్వారా ఈ ఏడాది జూన్‌లో రూ.24.03 లక్షల కోట్ల సొత్తు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. మొత్తం 18.39 బిలియన్ లావాదేవీలు నమోదైనట్లుగా నివేదిక పేర్కొంది. గతేడాది ఇదే నెలలో 13.88 బిలియన్ లావాదేవీలు జరగ్గా.. 32శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం 49.1 కోట్ల మంది సామాన్య ప్రజలు, 6.5 కోట్ల మంది వ్యాపారులు ఈ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. 675 బ్యాంకులు యూపీఐతో కలిసి పని చేస్తున్నాయి.
అయితే, మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 85శాతం యూపీఐ ద్వారా భారత్‌లో జరుగుతున్నాయి. రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 50 శాతం ఒక్క భారతదేశంలోనే జరుగుతున్నాయి. ఈ యూపీఐ సేవలు భారత్‌తో పాటు యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. అయితే, బ్రిక్స్ సభ్యత్వ దేశాలకు యూపీఐని విస్తరించాలని రిజర్వ్ బ్యాంక్ యోచిస్తున్నది. సురక్షితమైన, వేగవంతమైన లావాదేవీలతో యూపీఐ చెల్లింపులు ప్రజల్లో భారీగా పెరిగింది. 2016లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన యూపీఐ సర్వీసులకు మంచి స్పందన లభిస్తున్నది. అప్పటి నుంచి ఏటా యూపీఐ లావాదేవీలు పెరుగుతూ వచ్చాయి. యూపీఐ ద్వారా ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా ఆయా అకౌంట్లను ఒకే మొబైల్ యాప్‌లో లింక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎవరు ఎవరికైనా డబ్బులు పంపడం, దుకాణంలో బిల్లులు చెల్లించేందుకు సైతం అవకాశం ఉన్నది.