దావోస్, జనవరి 17: ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడంలో చైనా స్థానంలో త్వరలోనే భారత్ రాబోతున్నదన్న అంచనాలు సరికావని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు మిడిమిడి జ్ఞానంతో చేసేవేనని అభిప్రాయపడ్డ ఆయన తెలిసీతెలియనితనంతో ఇలా ఆలోచించవద్దని ఒకింత ఘాటుగా స్పందించారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)లో మీడియాతో రాజన్ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాలపై స్పందిస్తూ చైనా జీడీపీ పుంజుకుంటే ప్రపంచ ఆర్థిక వృద్ధికి అవకాశాలు లేకపోలేదన్నారు. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంలో చైనా స్థానంలోకి భారత్ ఇప్పుడప్పుడే రాబోదన్నారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసినా.. గ్లోబల్ ఎకానమీకి ఉత్సాహం రాగలదని చెప్పారు.