న్యూఢిల్లీ, నవంబర్ 12 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు 2.3 శాతం వరకు పెరిగే వీలున్నదని ప్రముఖ భారతీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా అంచనా వేసింది. నిజానికి బ్యాంకుల ఎన్పీఏలు గత కొన్నేండ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్రా అంచనా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నదిప్పుడు. 2021 నుంచి 2025 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏలు 9.11 శాతం నుంచి 2.58 శాతానికి తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఇవి మళ్లీ బాగానే పెరగవచ్చని ఇక్రా అంటున్నది.
ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంక్ రుణ వృద్ధి 10.7 శాతం నుంచి 11.5 శాతానికి పెరగొచ్చని ఇక్రా అంచనా వేస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు, పండుగ సీజన్ కలిసొచ్చి క్రెడిట్‌కు డిమాండ్ ఏర్పడిందని చెప్తున్నది. ఆర్బీఐ ద్రవ్యసమీక్షలో తీసుకున్న నిర్ణయాలతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనపు నిధులు రావడం కూడా రుణాల వృద్ధికి దోహదం చేసే అంశమేనని పేర్కొన్నది. కాగా, రిటైల్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల నుంచి రుణాలకు డిమాండ్ ఉంటున్నదని చెప్పింది.