ICICI Bank-Q3 Results | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో నికర లాభం 15 శాతం పెంచుకుంది. 2023-24 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 2024-25 తృతీయ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం రూ.11,792 కోట్లు (15శాతం) గడించింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ.10,272 కోట్ల నికర లాభం గడించింది. వివిధ రూపాల్లో బ్యాంకు ఆదాయం రూ.42,792 కోట్ల నుంచి రూ.48,368 కోట్లకు పెరిగింది.
2023-24 తృతీయ త్రైమాసికంలో బ్యాంకు వడ్డీ ఆదాయం రూ.36,695 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ.41,300 కోట్లకు పెరిగింది. బ్యాంకు స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏ) 2.3 నుంచి 1.96 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు (ఎన్పీఏ) 0.44 నుంచి 0.42 శాతానికి దిగి వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో క్యాపిటల్ అడిక్వసీ రేషియో 14.61 నుంచి 14.71 శాతానికి పెరిగింది.