న్యూఢిల్లీ, ఆగస్టు 19: మొబైల్ ఫోన్లు, వాటి విడిభాగాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 5 శాతానికి తగ్గించాలని భారతీయ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం 18 శాతం పడుతుండగా.. ఇది చాలా భారంగా ఉందని పేర్కొన్నది. జీఎస్టీ స్లాబుల సంఖ్యను 4 నుంచి 2కు తగ్గించేందుకు మోదీ సర్కారు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఐసీఈఏ పై విధంగా కోరుతున్నది. కాగా, ప్రస్తుతం రోజువారీ వినియోగ ఉత్పత్తులపై 5 శాతం, స్టాండర్డ్ గూడ్స్‌పై 12 శాతం, ఎలక్ట్రానిక్స్-సర్వీసెస్‌పై 18 శాతం, లగ్జరీ-హానికర ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీ పడుతున్నది. అయితే వీటిలో 12, 28 శాతం రేట్లను తొలగించి.. 5, 18 శాతం రేట్లకే జీఎస్టీ విధానాన్ని పరిమితం చేయాలని భావిస్తున్నారు.
12 శాతం స్లాబులోని 99 శాతం గూడ్స్‌ను 5 శాతంలోకి, 28 శాతం స్లాబులోని 90 శాతం గూడ్స్‌ను 18 శాతంలోకి మార్చనున్నట్టు తెలుస్తున్నది. అయితే 5, 18 శాతం స్లాబుల్లో ఇప్పుడున్న వస్తూత్పత్తులపై పన్ను భారం ఇకపైనా అలాగే ఉంటుందని సమాచారం. దీంతో మొబైల్ ఫోన్లపై పన్నును తగ్గించాలని, దాన్ని 5 శాతం స్లాబులోకి మార్చాలని ఐసీఈఏ కోరుతున్నది. నేటి డిజిటల్ యుగంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు, పాలనాపరమైన అంశాల్లో మొబైల్ ఫోన్ నిత్యవసర వస్తువుగా మారిందని, పన్ను భారాన్ని తగ్గించాలని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహిం ద్రు అంటున్నారు. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో వచ్చే నెల జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఇది తేలనున్నది.